Loading...
Hockey World Cup: ప్రపంచకప్‌ ముందు టీమ్‌ఇండియా జెర్సీపై దుమారం.. కాషాయ రంగుపై తీవ్ర విమర్శలు!
ప్రపంచకప్‌ ముందు టీమ్‌ఇండియా జెర్సీపై దుమారం.. కాషాయ రంగుపై తీవ్ర విమర్శలు!

Hockey World Cup: ప్రపంచకప్‌ ముందు టీమ్‌ఇండియా జెర్సీపై దుమారం.. కాషాయ రంగుపై తీవ్ర విమర్శలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 31, 2026
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రీడాకారులు ఏ క్రీడలో పాల్గొన్నా సాధారణంగా నీలి రంగు జెర్సీలనే ధరిస్తుంటారు. హాకీ జట్టు కూడా ఇప్పటివరకు అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. అయితే రాబోయే హాకీ ప్రపంచకప్‌కు భారత జట్టు కోసం కాషాయ (సాఫ్రన్‌) రంగు జెర్సీలను సిద్ధం చేయడం వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయంపై మాజీ క్రీడాకారులు సహా పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జెర్సీల రంగు మార్పు వెనుక అసలు ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదని పలువురు మాజీ హాకీ ఆటగాళ్లు వ్యాఖ్యానించారు. హకీ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయాన్ని వారు బహిరంగంగా తప్పుబట్టారు. మరోవైపు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజకీయ రంగును జాతీయ జట్టుపై రుద్దుతున్నారంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

వివరాలు

రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు

ఈ విమర్శల నేపథ్యంలో హాకీ ఇండియా స్పందించింది.

ప్రస్తుతం అంతర్జాతీయ హాకీలో ఎక్కువగా ఉపయోగిస్తున్న సింథటిక్‌ పిచ్‌లు నీలి రంగులో ఉంటున్నాయని, అదే రంగులో జెర్సీలు ధరించినప్పుడు ఆటగాళ్లను స్పష్టంగా గుర్తించడం కష్టమవుతోందని తెలిపింది.

ఈ కారణంగానే ఆటగాళ్లు, కోచ్‌ల సూచనల మేరకు భారత జాతీయ పతాకంలోని కాషాయ రంగును జెర్సీ కోసం ఎంపిక చేసినట్లు హాకీ ఇండియా స్పష్టం చేసింది.

ఇది పూర్తిగా ఆటకు అనుకూలంగా తీసుకున్న సాంకేతిక నిర్ణయమే తప్ప, దీనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది.

కాగా, హాకీ ప్రపంచకప్‌ ఆగస్టు 15 నుంచి 30 వరకు నెదర్లాండ్స్‌, బెల్జియం దేశాల్లో జరగనుంది. ఈ టోర్నీలో భారత జట్టు కొత్త కాషాయ జెర్సీలతో బరిలోకి దిగనుంది.

ADVERTISEMENT