US Open 2026: యూఎస్ ఓపెన్‌లో అరుదైన పోరు.. బిలియనీర్ల వారసుల మధ్య టెన్నిస్ సమరం
ఈ వార్తాకథనం ఏంటి
యూఎస్ ఓపెన్ 2026లో ఆసక్తికరమైన టెన్నిస్ పోరు చోటుచేసుకుంది. మహిళల క్వార్టర్ ఫైనల్‌లో అమెరికాకు చెందిన జెస్సికా పెగులా, ఎమ్మా నవారో తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో పెగులా విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. అయితే ఫలితం కంటే ఈ మ్యాచ్‌కు మరో ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న టెన్నిస్ క్రీడాకారిణులుగా భావించే ఇద్దరు ఒకే కోర్టులో పోటీ పడటం ఇదే తొలిసారి. వీరిద్దరూ అమెరికాకు చెందినవారే కాకుండా.. బిలియనీర్ల కుటుంబాల నుంచి వచ్చిన వారు కావడం విశేషం. పెగులా,నవారో కుటుంబాల కలిపిన ఆస్తుల విలువ సుమారు 15బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా.
వివరాలు
పెగులా కుటుంబ నేపథ్యం..
టెన్నిస్ దిగ్గజాలు రోజర్ ఫెదరర్,నొవాక్ జకోవిచ్,రాఫెల్ నాదల్ సంపదను కలిపినా.. ఈ ఇద్దరు క్రీడాకారిణుల కుటుంబాల సంపదే ఎక్కువగా ఉంటుందని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి.
జెస్సికా పెగులా అమెరికా బిలియనీర్ టెర్రీ పెగులా కుమార్తె. 2009లో టెన్నిస్ కెరీర్‌ను ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత ప్రపంచ టెన్నిస్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
టెర్రీ పెగులా క్రీడా రంగంతోపాటు ఇంధన వ్యాపారంలోనూ భారీగా పెట్టుబడులు పెట్టారు.
టెర్రీ పెగులా అమెరికా ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ లీగ్ ఎన్‌ఎఫ్‌ఎల్‌లోని బఫెలో బిల్స్, ఐస్ హాకీ లీగ్ ఎన్‌హెచ్‌ఎల్‌లోని బఫెలో సాబ్రెస్ జట్లకు యజమానిగా ఉన్నారు.
ఫోర్బ్స్ అంచనాల ప్రకారం పెగులా కుటుంబ ఆస్తుల విలువ సుమారు 11.8 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని సమాచారం.
వివరాలు
నవారో కుటుంబం నేపథ్యం..
ఇంతటి సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ జెస్సికా తన కెరీర్ కోసం టెన్నిస్‌ను ఎంచుకుంది. ప్రస్తుతం మహిళల టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో ఆమె మూడో స్థానంలో కొనసాగుతోంది.
ఎమ్మా నవారో కూడా అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన టెన్నిస్ క్రీడాకారిణే.
షెర్మన్ ఫైనాన్షియల్ గ్రూప్ వ్యవస్థాపకుడు బెన్ నవారో కుమార్తె ఆమె.ఈ కుటుంబానికి సుమారు 3.2 బిలియన్ డాలర్ల మేర ఆస్తులు ఉన్నట్లు అంచనా.
ఆర్థిక రంగంలో కార్యకలాపాలతోపాటు టెన్నిస్ క్రీడలోనూ నవారో కుటుంబానికి ఆసక్తి ఉంది.
సిన్సినాటి ఓపెన్,ఛార్లెస్టన్ ఓపెన్ వంటి ప్రముఖ టెన్నిస్ టోర్నీల్లో ఈ కుటుంబం భాగస్వామిగా ఉంది.
ఎమ్మా నవారో ఇప్పటివరకు యూఎస్ ఓపెన్‌లో ఒక్కసారి మాత్రమే సెమీఫైనల్‌కు చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచ మహిళల టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో 27వస్థానంలో ఉంది.
వివరాలు
మ్యాచ్‌లో పెగులాదే పైచేయి..
బిలియనీర్ల కుటుంబాలకు చెందిన ఇద్దరు క్రీడాకారిణులు తలపడిన క్వార్టర్ ఫైనల్‌లో జెస్సికా పెగులా విజయం సాధించింది.
ఆరంభంలో ఎమ్మా నవారో ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి సెట్‌ను 6-3తో తన ఖాతాలో వేసుకుంది.
అయితే ఆ తర్వాత పెగులా పుంజుకుంది. రెండో సెట్‌లో 6-4తో గెలిచి మ్యాచ్‌ను సమం చేసింది.
నిర్ణయాత్మక మూడో సెట్‌లోనూ అదే జోరును కొనసాగిస్తూ 6-3తో సెట్‌ను సొంతం చేసుకుంది.
మొత్తంగా 3-6, 6-4, 6-3 తేడాతో ఎమ్మా నవారోను ఓడించి సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టింది.
వివరాలు
సెమీస్‌లో సబలెంకాతో పోరు..
సెమీఫైనల్‌లో జెస్సికా పెగులాకు కఠినమైన ప్రత్యర్థి ఎదురుకానుంది. ఆమె బెలారస్ స్టార్ అరీనా సబలెంకాతో తలపడనుంది.
మరో సెమీఫైనల్‌లో అమెరికా స్టార్ కోకో గాఫ్, కజకిస్థాన్ క్రీడాకారిణి ఎలెనా రిబాకినా పోటీ పడనున్నారు.
ఈ రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు శుక్రవారం ఉదయం జరగనున్నాయి.
ఇదిలా ఉండగా.. మహిళల టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో సబలెంకాను వెనక్కి నెట్టి ఎలెనా రిబాకినా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.