Kidambi Srikanth: యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన కిదాంబి శ్రీకాంత్
ఈ వార్తాకథనం ఏంటి
యూఎస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచిపోయాడు. ఫైనల్‌లో చైనీస్ తైపీకి చెందిన సు లియాంగ్ చేతిలో పరాజయం పాలై రన్నరప్‌గా సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్ గంటకు పైగా హోరాహోరీగా సాగింది. 33 ఏళ్ల శ్రీకాంత్ తొలి గేమ్‌ను కోల్పోయినా, రెండో గేమ్‌లో అద్భుతంగా పుంజుకుని మ్యాచ్‌ను సమం చేశాడు. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో తనకంటే తొమ్మిదేళ్లు చిన్నవాడైన సు లియాంగ్ వేగాన్ని అందుకోలేకపోయాడు. ప్రత్యర్థి దూకుడైన ఆటకు తోడు శ్రీకాంత్ చేసిన అనవసర తప్పిదాలు కూడా అతని అవకాశాలను దెబ్బతీశాయి.
వివరాలు
శ్రీకాంత్‌కు కలిసి రాని ఫైనల్స్
ఈ పోరులో శ్రీకాంత్ 15-21, 21-16, 9-21 స్కోరుతో ఓటమి చవిచూశాడు. దీంతో ఈ సీజన్‌లో తన తొలి ఫైనల్‌ను టైటిల్‌గా మలచుకోవాలన్న ఆశ నెరవేరలేదు. ఇటీవలి కాలంలో శ్రీకాంత్‌కు ఫైనల్స్‌లో అదృష్టం కలిసి రావడం లేదు. గత ఏడాది మలేసియా మాస్టర్స్ సూపర్ 500, సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీల్లో కూడా రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నాడు. కాగా, 2021 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించడం అతని కెరీర్‌లో అత్యుత్తమ విజయాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం యూఎస్ ఓపెన్‌లో మరోసారి ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా శ్రీకాంత్ తన అనుభవం, పోరాట పటిమను మరోసారి చాటుకున్నాడు.