Usman Khawaja: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఉస్మాన్ ఖవాజా
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సిడ్నీ టెస్ట్ మ్యాచ్ తన కెరీర్‌లో చివరిదని ప్రకటిస్తూ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. ఈ సందర్భంగా తన క్రికెట్ ప్రయాణంలో ఎదుర్కొన్న అనుభవాలతో పాటు, జాతి వివక్షకు సంబంధించిన బాధాకరమైన అంశాలను కూడా ఖవాజా బహిరంగంగా వెల్లడించాడు. తాను ఎప్పుడూ కొంచెం భిన్నంగానే ఉన్నానని, ఇప్పటికీ అలాగే ఉన్నానని చెప్పారు. తాను నల్లజాతికి చెందిన క్రికెటర్‌ని. ఆస్ట్రేలియా తరఫున నేను క్రికెట్ ఆడలేనని చాలామంది చెప్పారు. కానీ నేను సాధించాను. అదే నాకు గర్వకారణం, ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అయితే జట్టులోని కొందరు సభ్యులు, మీడియా వర్గాలు నాతో వివక్షపూరితంగా వ్యవహరించాయి.
Details
నా విషయంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండేది
క్రికెట్‌పై నాకున్న అంకితభావం, నిబద్ధతపై అనుమానాలు వ్యక్తం చేశాయి. నా సన్నద్ధతను కూడా ప్రశ్నించాయని ఖవాజా ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఎదురైన వివక్షను మరింత వివరంగా చెబుతూ, 'జట్టులోని ఇతర ఆటగాళ్లు గాయపడితే వారికి సానుభూతి చూపించేవారు. 'అయ్యో పాపం.. జోష్ హేజిల్‌వుడ్', 'అయ్యో పాపం.. నాథన్ లైయన్' అంటూ మాట్లాడేవారు. కానీ నేను గాయపడితే మాత్రం నాదే తప్పన్నట్లుగా వ్యవహరించేవారు. ఇతర క్రికెటర్లు ముందు రోజు రాత్రి అధికంగా మద్యం సేవించి గాయపడినా వారిని ఏమీ అనేవారు కాదు. కానీ నా విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. ఈ విషయమే నాకు ఎక్కువ బాధను కలిగించిందని ఖవాజా చెప్పుకొచ్చాడు.
Details
తొలి ముస్లిం క్రికెటర్ గా చరిత్ర
పాకిస్థాన్‌లో జన్మించిన ఉస్మాన్ ఖవాజా, ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తొలి ముస్లిం క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. కెరీర్ ప్రారంభ దశలో జట్టుకు ఎంపిక కావడంలో అతడు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే ఆ తర్వాత ఓపెనర్‌గా స్థానం సంపాదించుకుని, జట్టులో కీలక ఆటగాడిగా నిలిచాడు. ప్రత్యేకంగా 2023లో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న జట్టులో ఖవాజా కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో మెల్‌బోర్న్ టెస్ట్‌లో అతడు 82 పరుగులు చేసి జట్టు పోరాటంలో నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు.
Details
ఖవాజా కెరీర్ గణాంకాలు ఇవే
2025 సంవత్సరంలో ఖవాజా 18 ఇన్నింగ్స్‌ల్లో 614 పరుగులు చేశాడు. అదే ఏడాది ప్రారంభంలో శ్రీలంకతో జరిగిన ఓ మ్యాచ్‌లో 232 పరుగులు చేసి తన బ్యాటింగ్ సత్తాను చాటాడు. మొత్తం కెరీర్‌ను పరిశీలిస్తే, ఉస్మాన్ ఖవాజా ఇప్పటివరకు 87 టెస్ట్‌లు, 40 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు ఆడి, అన్ని ఫార్మాట్లలో కలిపి 8,001 అంతర్జాతీయ పరుగులు సాధించాడు. సిడ్నీ టెస్ట్‌తో అతని అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణానికి ముగింపు పడనుంది.