LOADING...
Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీ వివాదంపై స్పందించిన బీసీసీఐ.. యువ ఆటగాడిపై చర్యలు ఉండవా?
వైభవ్ సూర్యవంశీ వివాదంపై స్పందించిన బీసీసీఐ.. యువ ఆటగాడిపై చర్యలు ఉండవా?

Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీ వివాదంపై స్పందించిన బీసీసీఐ.. యువ ఆటగాడిపై చర్యలు ఉండవా?

వ్రాసిన వారు Moogati Shabari
Jun 17, 2026
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంకలో జరుగుతున్న త్రైపాక్షిక సిరీస్‌లో భాగంగా సోమవారం దంబుల్లాలో భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య ఉత్కంఠభరితమైన పోరు జరిగింది. నిర్ణీత ఓవర్లలో మ్యాచ్ టైగా ముగియడంతో విజేతను తేల్చేందుకు సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్‌లో విజయానికి 17 పరుగులు అవసరమైన సమయంలో భారత్-ఏ జట్టు 9 పరుగులకే పరిమితమైంది. చివరి మూడు బంతులను ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ జట్టును గెలిపించలేకపోవడంతో భారత్-ఏ వరుసగా రెండో పరాజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ అనంతరం భారత బ్యాటర్లు వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ శెడ్గే పెవిలియన్ వైపు వెళ్తుండగా, శ్రీలంక ఆటగాళ్లు అతిగా సంబరాలు జరుపుతూ భారత జట్టును రెచ్చగొట్టేలా ప్రవర్తించినట్లు కనిపించింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వైభవ్ వెనక్కి తిరిగి లంకఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు.

వివరాలు

శ్రీలంక ఆటగాడిని తోసిన వైభవ్..

వాగ్వాదం మరింత తీవ్రమవుతున్న సమయంలో భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయిన వైభవ్ సూర్యవంశీ, ఒక శ్రీలంక ఆటగాడిని వెనక్కి తోసినట్లు వీడియోల్లో కనిపించింది. దీంతో మైదానంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే ఇతర శ్రీలంక ఆటగాళ్లు, అంపైర్లు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్రికెట్‌లో ఆటగాళ్ల మధ్య శారీరక ఘర్షణలను అత్యంత తీవ్రమైన క్రమశిక్షణా ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఐసీసీ నిబంధనల ప్రకారం భౌతిక దాడులు లేదా దురుసుగా ప్రవర్తించడం నిషేధితం. దీంతో వైభవ్‌పై బీసీసీఐ చర్యలు తీసుకోవచ్చని, జరిమానా లేదా నిషేధం విధించే అవకాశముందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది.

వివరాలు

బీసీసీఐ క్లారిటీ.. చర్యలు లేవన్న సెక్రటరీ..

ఈ ఘటనపై నెలకొన్న చర్చలకు బీసీసీఐ స్పందించింది. స్పోర్ట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా మాట్లాడుతూ, వైభవ్ సూర్యవంశీపై ప్రస్తుతం ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకునే యోచన లేదని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ, "మా ఆటగాళ్లు పూర్తిగా టోర్నమెంట్‌పైనే దృష్టి సారించాలని కోరుకుంటున్నాం. మైదానంలో లేదా మైదానం వెలుపల చోటుచేసుకునే ఇలాంటి అనవసర ఘటనలు వారి ఏకాగ్రతను దెబ్బతీయకూడదు" అని తెలిపారు. అదేవిధంగా భారత జట్టు కోచ్ కూడా శ్రీలంక ఆటగాళ్ల ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, మైదానంలో ఎలా వ్యవహరించాలో వారు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

Advertisement

వివరాలు

ఐసీసీ నిబంధనలు ఏమంటున్నాయి?

ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లోని ఆర్టికల్ 2.12 ప్రకారం, అంతర్జాతీయ మ్యాచ్ సమయంలో ఏ ఆటగాడైనా ప్రత్యర్థి ఆటగాడు, సహాయక సిబ్బంది, అంపైర్ లేదా మ్యాచ్ రిఫరీతో అనుచితంగా శారీరకంగా ప్రవర్తించడం నిషేధించబడింది. ప్రత్యర్థి ఆటగాడిని కావాలనే లేదా నిర్లక్ష్యంగా నెట్టడం, ఢీకొనడం వంటి చర్యలు నిబంధనల ఉల్లంఘన కింద పరిగణించబడతాయి. గొడవకు దారితీసిన పరిస్థితులు ఏమిటి, ఎవరైనా ముందుగా రెచ్చగొట్టారా, సంఘటనలో ఎవరైనా గాయపడ్డారా వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ ఘటనలో శ్రీలంక ఆటగాళ్ల ప్రవర్తనే మొదట ఉద్రిక్తతకు కారణమైందని భావించడంతో, శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా తమ ఆటగాళ్లపై చర్యలు ప్రారంభించినట్లు సమాచారం.

Advertisement

వివరాలు

ఫామ్ కోసం ఎదురుచూస్తున్న వైభవ్..

ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో ఆకట్టుకునే ప్రదర్శనతో గుర్తింపు పొందిన వైభవ్ సూర్యవంశీ, ఈ త్రైపాక్షిక సిరీస్‌లో మాత్రం తన స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. మ్యాచ్‌లలో మంచి ఆరంభాలు లభిస్తున్నప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో అతడు విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్‌లో అతను 14, 44, 21 పరుగుల ఇన్నింగ్స్‌లు మాత్రమే నమోదు చేశాడు. అయితే అతని ప్రతిభపై పూర్తి విశ్వాసం ఉంచిన బీసీసీఐ, ఈ వివాదం కారణంగా అతని భవిష్యత్తుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా మద్దతుగా నిలిచింది. ఇక అఫ్గానిస్థాన్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లో విజయం సాధించి పుంజుకోవాలని భారత్-ఏ జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement