LOADING...
Vaibhav Suryavanshi: టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ?.. బీసీసీఐ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు!
టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ?.. బీసీసీఐ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు!

Vaibhav Suryavanshi: టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ?.. బీసీసీఐ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2026
12:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

వయసు కేవలం 15 ఏళ్లు. కానీ అతడి బ్యాటింగ్ విధ్వంసం ముందు బౌలర్లు తలవంచాల్సి వస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో తన అద్భుత ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని వెంటనే భారత జట్టులోకి ఎంపిక చేయాలనే డిమాండ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అతడి భవిష్యత్తుపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

వివరాలు

వైభవ్‌కు బీసీసీఐ పూర్తి మద్దతు

వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై ప్రశంసలు కురిపించిన దేవజిత్ సైకియా, అతడు అత్యంత ప్రతిభావంతమైన ఆటగాడని కొనియాడారు. ''వైభవ్ అద్భుతమైన క్రికెటర్. అతడికి ఉజ్వల భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యున్నత స్థాయికి చేరుకునేలా, భవిష్యత్తులో గొప్ప ఆటగాడిగా ఎదిగేలా బీసీసీఐ తరఫున అన్ని విధాలా మద్దతు అందిస్తామని స్పష్టం చేశారు.

వివరాలు

పరుగుల వేటలో రికార్డుల మోత

రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన బిహార్‌కు చెందిన ఈ యువ ఆటగాడు ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల వరద పారించాడు. టోర్నీలో అత్యధికంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. అంతేకాకుండా 237.30 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో ఈ ఘనత సాధించడం విశేషం. కేవలం 15 ఏళ్ల 65 రోజుల వయసులోనే ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకుని ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఆరెంజ్ క్యాప్ విజేతగా వైభవ్ సూర్యవంశీ కొత్త చరిత్ర సృష్టించాడు.

Advertisement

వివరాలు

గిల్, సుదర్శన్ రికార్డులకు చెక్

ఈ క్రమంలో గతంలో అత్యంత పిన్న వయసులో ఆరెంజ్ క్యాప్ సాధించిన ఆటగాళ్ల రికార్డులను వైభవ్ బద్దలు కొట్టాడు. గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ సాయి సుదర్శన్ 2025 సీజన్‌లో 23 ఏళ్ల 231 రోజుల వయసులో ఆరెంజ్ క్యాప్ గెలుచుకోగా, శుభ్‌మన్ గిల్ 2023లో 23 ఏళ్ల 263 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు వారిద్దరి రికార్డులను వైభవ్ చాలా తక్కువ వయసులోనే అధిగమించాడు.

Advertisement

వివరాలు

భారత క్రికెట్ భవిష్యత్తుపై భారీ అంచనాలు

ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ ఆడిన దూకుడైన ఇన్నింగ్స్‌లు, అతడి అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యం భారత క్రికెట్ భవిష్యత్తుపై భారీ అంచనాలను పెంచాయి. ఈ టీనేజ్ సంచలనం త్వరలోనే భారత జట్టులో చోటు దక్కించుకుంటాడా అనే చర్చ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో జోరుగా సాగుతోంది

Advertisement