మహిళా రెజ్లర్లపై కోచ్‌లు లైంగిక వేధింపులు
కోచ్‌ల వేధింపులు తాళలేక 30మంది మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం ధర్నాకు దిగారు. బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఏషియన్ గేమ్స్ స్వర్ణ పతక విజేత వినేష్ పొగట్, సాక్షి మాలిక్ లైగింక వేధింపుల ఆరోపణలను చేశారు. చాలా ఏళ్లుగా జాతీయ కోచ్‌లు రెజ్లర్లను లైంగికంగా వేధిస్తూ, చంపుతామని బెదిరిస్తున్నారని పొగట్ చెప్పింది. ఈ ధర్నాలో ఆమెతో పాటు రెజ్లర్లు పాల్గొన్నారు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిని తొలగించాలని వారు డిమాండ్ చేశారు. జాతీయ శిబిరాల్లో కోచ్‌లు, డబ్ల్యుఎఫ్‌ఐ ప్రెసిడెంట్ ద్వారా మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులకు గురయ్యారని ఫోగట్ పేర్కొంది, పలువురు యువతులు రెజ్లర్లకు ఫిర్యాదు చేసి, ఏడ్చారని ఆమె తెలిపారు.
బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు : భూషణ్ శరణ్ సింగ్
కనీసం 20మంది బాలికలు జాతీయ శిబిరంలో లైంగిక వేధింపులకు గురయ్యారని, అధికారుల నుంచి బెదిరింపులు కూడా వచ్చాయని ఫోగట్ వాపోయింది. మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలపై డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్పందించారు. అవన్నీ అవాస్తవాలని ఖండించారు. అలాంటిది జరిగితే తానే ఉరేసుకుంటానని చెప్పాడు. వాళ్లంతా జాతీయ పోటీల్లో పాల్గొనడానికి గానీ, ట్రయల్స్ ఇవ్వడానికి గానీ సిద్ధంగా లేరన్నారు. కావాలనే తనపై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. తాను విచారణకు సిద్ధంగా ఉన్నానని భూషణ్ చెప్పారు. కొత్త రెజ్లర్ల భవిష్యత్తు సురక్షితంగా ఉండాలంటే మొత్తం సమాఖ్యను తొలగించాలని ఒలింపిక్ రెజ్లర్ సాక్షి మాలిక్ చెప్పారు. కొత్త సమాఖ్య ఉనికిలోకి రావాలంటే కొన్ని విషయాలపై కచ్చితంగా విచారణ జరగాలన్నారు.