AUS Vs PAK: విష జ్వరాల భారీన పడిన పాక్ కీలక ఆటగాళ్లు.. ఆస్ట్రేలియాతో మ్యాచుకు డౌటే!
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా గత శనివారం టీమిండియాతో జరిగిన మ్యాచులో పరాజయం పాలైన పాకిస్థాన్, మరో కీలక సమరానికి సిద్ధమైంది. అక్టోబర్ 20న చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో తలపడేందుకు బెంగళూరుకు చేరుకున్న పాక్ జట్టు కష్టాల్లో పడింది. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టును విష జ్వరాలు బాధిస్తున్నాయని పీసీబీ మీడియా మేనేజర్ అషాన్ ఇఫ్తికార్ చెప్పాడు. భారత్‌తో మ్యాచ్ తర్వాత పాకిస్థాన్ ఆటగాళ్లు విష జ్వరాల భారీన పడ్డారని, చాలామంది ఆటగాళ్ల ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడిందని, అయితే ఇద్దరు ప్లేయర్స్ మాత్రం ఇంకా కోలుకోలేదని పేర్కొన్నారు. ఈ ఇద్దరిలో ఒకరు ఇప్పటికీ ఫ్లూతో బాధపడుతున్నట్లు సమాచారం.
పాయింట్ల పట్టికలో నాలుగో స్థానం
పాక్ కెప్టెన్ బాబార్ అజామ్, స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిది ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిసింది. ఇక ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ లోపు పాక్ ఆటగాళ్లంతా కోలుకుని ఫిట్ గా ఉంటారని పీసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక ఫ్లూతో బాధపడుతున్న ప్లేయర్ మాత్రం ఆస్ట్రేలియాతో మ్యాచుకు దూరమయ్యే అవకాశం ఉంది. అయితే ఆ అటగాడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఈ టోర్నీలో మూడు మ్యాచులు ఆడిన పాకిస్థాన్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.