టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ
Virat Kohli T20 Retirement: టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. ఈ విజయం తర్వాత విరాట్ కోహ్లీ అభిమానులకు షాక్ ఇచ్చాడు. అంతర్జాతీయ టీ20లకు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇదే తన చివరి టీ20 వరల్డ్ మ్యాచ్ అంటూ అభిమానుల గుండెలు బద్దలయ్యే న్యూస్ చెప్పాడు. ఫైనల్ గెలిచిన తర్వాత కోహ్లీ మాట్లాడుతూ.. 'ఇది నా చివరి టీ20 ప్రపంచకప్. ఇదే మేము సాధించాలనుకున్నాం. తర్వాతి తరం టీ20 ఆటను ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. ఐసీసీ టోర్నీ గెలవడానికి చాలా కాలంగా టీమిండియా వేచి ఉంది. రిటైర్మెంట్ కు ఇదే మంచి అవకాశంగా భావిస్తున్నా' అని అన్నారు.
కోహ్లీ టీ20 అంతర్జాతీయ క్రికెట్ కెరీర్
కోహ్లీ తన కెరీర్లో మొత్తం 125 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 4188 పరుగులు చేశాడు. 48.69 సగటు అతని సొంతం.39హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ చేశాడు. ఈ ప్రపంచ కప్ ఫైనల్లో సైతం కోహ్లీ అద్భుతమైన ఫిఫ్టీని చేశాడు. ఫైనల్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 34 పరుగులకే 3వికెట్లు కోల్పోయింది. తర్వాత విరాట్ కోహ్లీ బాధ్యతలు స్వీకరించి 5వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్ పటేల్‌తో కలిసి 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత కోహ్లీ 48 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో అతనికిదే తొలి అర్ధశతకం. కోహ్లి 59 బంతుల్లో మొత్తం 76 పరుగులు చేశాడు.