LOADING...
Virat - Sachin: వన్డేల్లో సచిన్‌ రికార్డును బద్దలు కొట్టే దిశగా విరాట్‌ కోహ్లీ!.. ఛాన్సులు ఎలా ఉన్నాయంటే?
వన్డేల్లో సచిన్‌ రికార్డును బద్దలు కొట్టే దిశగా విరాట్‌ కోహ్లీ!.. ఛాన్సులు ఎలా ఉన్నాయంటే?

Virat - Sachin: వన్డేల్లో సచిన్‌ రికార్డును బద్దలు కొట్టే దిశగా విరాట్‌ కోహ్లీ!.. ఛాన్సులు ఎలా ఉన్నాయంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 26, 2025
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆయన 463 వన్డేల్లో 18,426 పరుగులు చేసి ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇందులో మొత్తం 49 శతకాలున్నాయి. ఇక రెండో స్థానంలో మరో భారత బ్యాటర్‌ రన్నింగ్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ ఉన్నాడు. ఆయన ఇప్పటివరకు 305 వన్డేల్లో 293 ఇన్నింగ్స్‌ల్లో 14,255 పరుగులు సాధించాడు. అయితే సెంచరీల పరంగా చూస్తే, విరాట్‌ కోహ్లీనే టాప్‌. సచిన్‌ 49 సెంచరీల వద్ద ఆగిపోగా, విరాట్‌ ఇప్పటికే 51 శతకాలు కొట్టేశాడు. తాజాగా ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో హాఫ్‌ సెంచరీ సాధించిన కోహ్లీ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

Details

అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానం

వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. దీంతో సచిన్‌ రికార్డుపై కోహ్లీ దృష్టి పెడతాడా? ఆ రికార్డును బద్దలు కొడతాడా అని అభిమానుల్లో చర్చలు మొదలయ్యాయి. ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేల్లో డకౌట్‌ కావడంతో కొందరు 'విరాట్‌ రిటైర్మెంట్‌ సమీపంలో ఉందని కామెంట్లు చేశారు. అయితే మూడో వన్డేలో అర్ధశతకం సాధించి కోహ్లీ తన ఫామ్‌ను మళ్లీ నిరూపించుకున్నాడు. అంతేకాక ఛేజింగ్‌లో అత్యధిక హాఫ్‌ సెంచరీలు(70)చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. వన్డేల్లో వేగంగా 14 వేల పరుగుల మైలురాయిని చేరిన క్రికెటర్‌గా కూడా కోహ్లీ మరో మైలురాయిని అందుకున్నాడు. ఇప్పుడు అతని ముందు సచిన్‌ రికార్డే లక్ష్యం. కానీ దానిని అధిగమించాలంటే కోహ్లీకి ఇంకా 4,172 పరుగులు అవసరం.

Details

11 వన్డేలు ఆడే అవకాశం

అయితే, కోహ్లీ వచ్చే వన్డే ప్రపంచకప్‌ వరకూ ఆడతాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. ఒకవేళ ఆ వరకూ కొనసాగుతాడని అనుకుంటే కూడా సచిన్‌ రికార్డును దాటగలడా అనేది కాస్త సందేహాస్పదమే. ఎందుకంటే బీసీసీఐ విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం భారత్‌ 2026లో కేవలం 12వన్డేలు మాత్రమే ఆడనుంది. అదే ఏడాది వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఫైనల్‌ వరకు వెళ్తే గరిష్టంగా 11మ్యాచులు ఆడే అవకాశం ఉంటుంది. అదనంగా ఆసియా కప్‌ కూడా వన్డే ఫార్మాట్‌లో జరిగే అవకాశం ఉంది. అందులో కనీసం 6 మ్యాచ్‌లు ఉండవచ్చు. అంటే మొత్తంగా 30వన్డేలు మాత్రమే కోహ్లీ ఆడే అవకాశం ఉందని విశ్లేషకుల లెక్క. అయితే, ఇది ఆయన 2026 వరకూ ఆడితేనే సాధ్యమవుతుంది.

Details

క్రీడా నిపుణుల అంచనాలు ఇవే

1. ప్రతి ఇన్నింగ్స్‌లో కనీసం 40 పరుగులు చేస్తే మొత్తం 1,200 పరుగులు చేయవచ్చు. 2. కెరీర్‌ సగటు (57) ప్రకారం ఆడితే కనీసం 1,700 పరుగుల వరకు సాధించే అవకాశం ఉంది. 3. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో మాదిరిగానే ఫామ్‌లో కొనసాగి 30 మ్యాచుల్లో 60 నుంచి 70 సగటుతో పరుగులు చేస్తే 2,000 వరకు చేరవచ్చు. అయితే ప్రతి మ్యాచ్‌లోనూ సెంచరీ చేసినా గరిష్టంగా 3,000 పరుగులు మాత్రమే చేయగలడు. అయినా కూడా సచిన్‌ రికార్డును విరాట్‌ అందుకోవడం సాధ్యం కాదు. కానీ వన్డేల్లో 16 వేల లేదా 17 వేల పరుగుల మైలురాయిని చేరుకునే అవకాశాలు మాత్రం బలంగా ఉన్నాయి.