Virat Kohli-IPL 2026: 'కింగ్' కోహ్లీ రెడీ… మరోసారి ఆర్సీబీ చరిత్ర సృష్టిస్తుందా?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ బెంగళూరుకు చేరుకున్నాడు. వెంటనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుతో కలిసి ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. కోహ్లీ రాకతో జట్టులో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆర్సీబీ టైటిల్‌ను కాపాడుకునే లక్ష్యంతో కోహ్లీ సన్నద్ధమవుతున్నాడు. గత సీజన్‌లో ఆర్సీబీ చారిత్రాత్మక విజయం సాధించడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు.
వివరాలు
కోహ్లీపైనే అందరి ఆశలు
గత సీజన్‌లో కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. మొత్తం 657 పరుగులు చేసి, 144.71 స్ట్రైక్ రేట్, 54.75 సగటుతో ఎనిమిది అర్ధశతకాలు సాధించాడు. కోహ్లీ తన ఫామ్‌తోఆర్సీబీకి 18 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించాడు. గత ఐపీఎల్ సీజన్ విజయంతో ఆర్సీబీ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. మరోవైపు జట్టు నాయకత్వంలో రాజత్ పటిదార్ కూడా కీలక పాత్ర పోషించాడు. టైటిల్ గెలిచిన తరువాత అదే ఫామ్‌ను కొనసాగించడం ఇప్పుడు జట్టుకు పెద్ద సవాల్‌గా మారింది. ఈ సీజన్‌లో కూడా కోహ్లీపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.
వివరాలు
మరోసారి టైటిల్‌పై కన్ను
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 267 మ్యాచ్‌ల్లో 8,661 పరుగులు నమోదు చేసి టాప్‌లో ఉన్నాడు. ఎనిమిది సెంచరీల రికార్డు కూడా అతని పేరుమీదే ఉంది. ఐపీఎల్ 2026లో ఆర్సీబీ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 28న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది. ఈ సీజన్‌లో కోహ్లీ ప్రదర్శన ఎలా ఉంటుందో, ఆర్సీబీ టైటిల్‌ను నిలబెట్టుకుంటుందో అన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.