LOADING...
Mohammed Shami: బెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణ.. మహ్మద్‌ షమీకి ఈసీ నోటీసులు
బెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణ.. మహ్మద్‌ షమీకి ఈసీ నోటీసులు

Mohammed Shami: బెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణ.. మహ్మద్‌ షమీకి ఈసీ నోటీసులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 05, 2026
05:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణల (Special Intensive Revision - SIR) ప్రక్రియలో భాగంగా పలువురు ప్రముఖులకు ఎన్నికల కమిషన్ (ఈసీ) సమన్లు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ నటుడు దేవ్‌ (దీపక్‌ అధికారి)తో పాటు భారత క్రికెటర్ మహ్మద్‌ షమీకి కూడా హియరింగ్‌కు హాజరు కావాలంటూ నోటీసులు అందాయి. ఈ పరిణామంపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందిస్తూ, ఇది కేవలం వేధింపులకు పాల్పడే చర్యగా ఆరోపించింది. వివరాల్లోకి వెళితే, ఎంపీ దేవ్‌తో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో ముగ్గురు సభ్యులకు కూడా ఎన్నికల కమిషన్ నోటీసులు పంపినట్లు సమాచారం.

Details

అధికారిక ప్రకటన వెలువడలేదు

ఘటల్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన దేవ్, ప్రస్తుతం కోల్‌కతాలోని సౌత్‌ సిటీ రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లో నివసిస్తున్నారు. ఈసీ నోటీసులపై దేవ్‌ తరఫున ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు. ఇదే సమయంలో, భారత ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీకి కూడా ఓటరు జాబితాలోని కొన్ని అంశాలపై వివరణ కోరుతూ హియరింగ్ నోటీసు అందింది. ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన షమీ, తన క్రికెట్ కెరీర్ కారణంగా గత కొన్నేళ్లుగా కోల్‌కతాలోనే నివసిస్తున్నాడు. ఆయన పేరు జాదవ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదైంది. ప్రస్తుతం షమీ రాజ్‌కోట్‌లో జరుగుతున్న విజయ్‌ హజారే ట్రోఫీలో పాల్గొంటున్నందున, సోమవారం నిర్వహించాల్సిన హియరింగ్‌కు హాజరు కాలేకపోయాడు.

Details

 షమీ సోదరుడికి కూడా ఇదే తరహా నోటీసులు 

టోర్నీ ముగిసిన తర్వాత హాజరవుతాడని సమాచారం. షమీ సోదరుడికి కూడా ఇదే తరహా నోటీసులు అందినట్లు తెలిసింది. ఇంతకుముందు కూడా నటుడు అనిర్బన్‌ భట్టాచార్య, అలాగే నటుల దంపతులు కౌశిక్‌ బెనర్జీ, లాబోని సర్కార్‌లకు ఈసీ నుంచి ఇలాంటి నోటీసులు అందాయి. సోమవారం జరిగిన హియరింగ్‌కు హాజరైన లాబోని సర్కార్ మీడియాతో మాట్లాడుతూ వారు కొన్ని పత్రాలపై సంతకాలు తీసుకుని పంపించారని తెలిపారు. అయితే, బిజీ షెడ్యూల్‌లతో ఉండే నటీనటులు, ప్రముఖులను ఈ విధంగా పిలిపించడం అనవసర వేధింపులకు గురిచేయడమేనని స్థానిక తృణమూల్ కాంగ్రెస్ కౌన్సిలర్ మౌసమి దాస్ తీవ్రంగా విమర్శించారు.

Advertisement