Loading...
Major League Cricket: టీ20లో చరిత్ర సృష్టించిన వాషింగ్టన్ ఫ్రీడమ్.. 267 పరుగుల ఛేదనతో ప్రపంచ రికార్డు!
టీ20లో చరిత్ర సృష్టించిన వాషింగ్టన్ ఫ్రీడమ్.. 267 పరుగుల ఛేదనతో ప్రపంచ రికార్డు!

Major League Cricket: టీ20లో చరిత్ర సృష్టించిన వాషింగ్టన్ ఫ్రీడమ్.. 267 పరుగుల ఛేదనతో ప్రపంచ రికార్డు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 16, 2026
01:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) 2026 సీజన్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు ఎవరూ చేయని విధంగా 267 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఎంఐ న్యూయార్క్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి ఛాలెంజర్ మ్యాచ్‌కు అర్హత సాధించింది.

వివరాలు

పూరన్ మెరుపు సెంచరీ

మొదట బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్ నిర్ణీత 20 ఓవర్లలో భారీగా 266 పరుగులు చేసింది.

నికోలస్ పూరన్ కేవలం 31 బంతుల్లోనే శతకం బాది ఎంఎల్‌సీ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు.

అతనికి తోడుగా కీరన్ పొలార్డ్ 25 బంతుల్లో 64 పరుగులతో విరుచుకుపడ్డాడు.

ఈ ఇన్నింగ్స్‌లో పొలార్డ్ టీ20 క్రికెట్‌లో 1,000 సిక్సర్లు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా (క్రిస్ గేల్ తర్వాత) అరుదైన ఘనత సాధించాడు.

వివరాలు

10/2 నుంచి చరిత్ర సృష్టించిన వాషింగ్టన్

267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వాషింగ్టన్ ఫ్రీడమ్‌కు ఆరంభం షాక్‌లా మారింది. కేవలం 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది.

ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్, వికెట్‌కీపర్ ఆండ్రీస్ గౌస్ కలిసి మ్యాచ్‌ను పూర్తిగా మలుపు తిప్పారు.

ఇద్దరూ మూడో వికెట్‌కు ఏకంగా 241 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేశారు.

ADVERTISEMENT

వివరాలు

స్మిత్ అజేయ శతకం.. గౌస్ విధ్వంసకర ఇన్నింగ్స్

స్టీవ్ స్మిత్ కేవలం 48 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో అజేయంగా 110 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

మరోవైపు ఆండ్రీస్ గౌస్ 51 బంతుల్లో 132 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వీరి దూకుడుతో వాషింగ్టన్ ఫ్రీడమ్ కేవలం 18.4 ఓవర్లలోనే 267 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది.

టీ20ల్లో అత్యధిక లక్ష్య ఛేదనగా ఇప్పటివరకు 265 పరుగుల రికార్డు ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ పేరిట ఉండేది.

ఇప్పుడు 267 పరుగులు ఛేదించిన వాషింగ్టన్ ఫ్రీడమ్ ఆ రికార్డును అధిగమించి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

ADVERTISEMENT

వివరాలు

గతేడాది ఓటమికి ప్రతీకారం

గత సీజన్ ఫైనల్‌లో ఎంఐ న్యూయార్క్ చేతిలో ఓటమి పాలైన వాషింగ్టన్ ఫ్రీడమ్.. ఈ విజయంతో ప్రతీకారం తీర్చుకుంది.

ఇప్పుడు ఛాలెంజర్ మ్యాచ్‌లో శాన్‌ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌తో తలపడనుంది.

ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఈ నెల 18న జరిగే ఫైనల్‌లో లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌తో టైటిల్ కోసం పోరాడనుంది.

ADVERTISEMENT