Asia Games 2023 : క్రికెట్‌లో మేం స్వర్ణం సాధించా.. ఇక మీరు కూడా గెలవాలి : జెమీయా రోడ్రిగ్స్
ఆసియా గేమ్స్ లో భారత మహిళా క్రికెటర్లు స్వర్ణం పతకం గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు చేసింది. స్మృతి మంధాన(46), జెమీయా రోడ్రిగ్స్ 42 పరుగులతో రాణించారు. లక్ష్య చేధనలో లంక 8 వికెట్లకు 97 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. ఆసియా గేమ్స్‌లో మూడు మ్యాచులాడిన జెమీయా రోడ్రిగ్స్ భారత తరుఫున 109 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. గోల్డ్ మెడల్ అందుకున్న అనంతరం జెమీయా, భారత పురుషుల జట్టుకు కీలక సందేశాన్ని ఇచ్చింది.
పురుషుల జట్టు గోల్డ్ మెడల్ సాధించాలి
ఇక పురుషుల జట్టు గురించి మాట్లాడుకోవాలని, తాము గోల్డ్ మెడల్ సాధించామని, ఇక పురుషుల జట్టు కూడా గోల్డ్ మెడల్ తీసుకురావాలని జెమీయా పేర్కొంది. పోడియంపై భారత జాతీయ జెండా సగర్వంగా ఎగరడం ఆనందంగా ఉందని, తొలిసారి భారత మహిళా క్రికెట్ జట్టు గోల్డ్ మెడల్ సాధించి చరిత్రలో నిలిచిపోయిందని చెప్పింది. బ్యాటింగ్‌లో మంధానతో కలిసి కీలకమైన భాగస్వామ్యం నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడికి రాకముందు పిచ్ ల పరిస్థితి గురించి పెద్దగా తెలియదని, కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడి గెలవాలనే లక్ష్యంతో ముందుకు సాగామని జెమీయా వెల్లడించింది.