Loading...
IND vs SL: గాలెలో మనదే పట్టు.. లంకపై టీమిండియా జోరు
గాలెలో మనదే పట్టు.. లంకపై టీమిండియా జోరు

IND vs SL: గాలెలో మనదే పట్టు.. లంకపై టీమిండియా జోరు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2026
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా గాలె టెస్టులో శ్రీలంకపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. బ్యాటింగ్‌లో భారీ స్కోరు సాధించిన శుభ్‌మన్‌ గిల్‌ బృందం.. బౌలింగ్‌లోనూ సత్తా చాటి తొలి టెస్టులో విజయానికి చేరువైంది. మానవ్‌ సుతార్‌, రవీంద్ర జడేజా స్పిన్‌ మాయతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ను 284 పరుగులకే పరిమితం చేశారు. దీంతో భారత్‌కు 178 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. అయితే మ్యాచ్‌ ఫలితంపై వరుణుడి ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తోంది. మూడో రోజు ఆట సోమవారం కొనసాగగా, ఉదయం 460/9 ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ మరో రెండు పరుగులు మాత్రమే జోడించి ఆలౌటైంది. ప్రసిద్ధ్‌ కృష్ణను అసిత ఫెర్నాండో ఔట్‌ చేయడంతో భారత ఇన్నింగ్స్‌ ముగిసింది.

వివరాలు

ఇన్నింగ్స్ రెండో బంతికే నిషాన్ మదుష్క ఔట్

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే సిరాజ్‌ షాక్‌ ఇచ్చాడు. ఇన్నింగ్స్‌ రెండో బంతికే నిషాన్‌ మదుష్కను పెవిలియన్‌కు పంపాడు.

ఆఫ్‌స్టంప్‌ వెలుపలికి వెళ్తున్న బంతిని ఆడే ప్రయత్నంలో మదుష్క తొలి స్లిప్‌లో పడిక్కల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత భారత స్పిన్నర్లు రంగంలోకి దిగడంతో లంక బ్యాటర్లకు కష్టాలు మొదలయ్యాయి.

తన కెరీర్‌లో కేవలం రెండో టెస్టు ఆడుతున్న స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ కీలక వికెట్లు పడగొట్టాడు.

చండిమాల్‌ కేవలం నాలుగు పరుగులకే సుతార్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.

బాగా టర్న్‌, బౌన్స్‌ అయిన ఆ బంతిని ఆడే ప్రయత్నంలో చండిమాల్‌ ఔట్‌సైడ్‌ ఎడ్జ్‌ ఇచ్చాడు. లహిరు ఇగలగమగె 27పరుగులు చేసి జైస్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

వివరాలు

దినుష, డిక్వెలా అద్భుత పోరాటం

ఈ దశలో సోనాల్‌ దినుష, డిక్వెలా శ్రీలంకను ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 216 బంతుల్లో 146 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

రెండో సెషన్‌లోనే ఈ జంట 116 పరుగులు జోడించింది. భారత స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్వీప్‌ షాట్లతో పరుగులు రాబట్టారు.

బంతి ఏమాత్రం గతి తప్పినా బౌండరీలకు తరలించారు. డిక్వెలా మరింత దూకుడుగా ఆడుతూ 67 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు.

20 పరుగుల వద్ద స్లిప్‌లో కేఎల్‌ రాహుల్‌ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేయడంతో అతడికి లైఫ్ లభించింది.

ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న డిక్వెలా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. దినుష మాత్రం తొందరపడకుండా ఆడుతూ 92 బంతుల్లో అర్ధశతకం సాధించాడు.

ADVERTISEMENT

వివరాలు

80 పరుగుల వద్ద డిక్వెలా ఔట్

అయితే సెంచరీ దిశగా సాగుతున్న డిక్వెలా ఇన్నింగ్స్‌ 80 పరుగుల వద్ద ముగిసింది.

ప్రసిద్ధ్‌ కృష్ణ బౌలింగ్‌లో అతడు పంత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అప్పటికి శ్రీలంక స్కోరు 236 పరుగులు. వెంటనే నువంత కూడా ఔటయ్యాడు.

మరోవైపు దినుష మాత్రం అద్భుతంగా పోరాడాడు. 167 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి కెరీర్‌లో తొలి టెస్టు శతకాన్ని నమోదు చేశాడు.

అయితే సెంచరీ చేసిన వెంటనే మరో పరుగు కూడా జోడించకుండానే ఔటయ్యాడు.

శ్రీలంక 274 పరుగుల వద్ద ఉన్నప్పుడు జయసూర్యను సుతార్‌ ఔట్‌ చేయగా.. దినుషను జడేజా పెవిలియన్‌కు పంపాడు.

చివర్లో లహిరు కుమారను సుతార్‌ స్టంపౌట్‌ చేయడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ 284 పరుగుల వద్ద ముగిసింది.

ADVERTISEMENT

వివరాలు

గెలుపు దిశగా భారత జట్టు

శ్రీలంక ఇన్నింగ్స్‌లో దినుష 100 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. డిక్వెలా 80 పరుగులతో కీలక సహకారం అందించాడు.

భారత బౌలర్లలో సుతార్‌ 4/76తో నాలుగు వికెట్లు పడగొట్టాడు. జడేజా 3/57తో రాణించాడు. లంక ఇన్నింగ్స్‌ ముగిసిన వెంటనే వర్షం మొదలవడంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించలేకపోయింది.

దీంతో మూడో రోజు మొత్తం 80.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఇక రెండు రోజుల ఆట మిగిలి ఉండగా భారత్‌ ఇప్పటికే 178 పరుగుల ఆధిక్యంలో ఉంది.

పరిస్థితులు అనుకూలిస్తే రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ వేగంగా పరుగులు సాధించి డిక్లేర్‌ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత శ్రీలంకను ఆలౌట్‌ చేసి విజయాన్ని అందుకోవాలని టీమ్‌ఇండియా భావిస్తోంది.

ADVERTISEMENT