Loading...
Gyaneswari: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో రజతం.. వెయిట్‌లిఫ్టింగ్‌లో జ్ఞానేశ్వరి యాదవ్ సత్తా

Gyaneswari: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో రజతం.. వెయిట్‌లిఫ్టింగ్‌లో జ్ఞానేశ్వరి యాదవ్ సత్తా

వ్రాసిన వారు Moogati Shabari
Jul 27, 2026
09:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ల విజయపరంపర కొనసాగుతోంది. మహిళల 53 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత క్రీడాకారిణి జ్ఞానేశ్వరి యాదవ్ రజత పతకాన్ని కైవసం చేసుకుని దేశానికి మరో గర్వకారణంగా నిలిచింది. ఫైనల్ పోటీల్లో జ్ఞానేశ్వరి స్నాచ్ విభాగంలో 88 కిలోల బరువును విజయవంతంగా ఎత్తింది. అనంతరం క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కిలోలను అధిగమించి, మొత్తం 199 కిలోల లిఫ్ట్‌తో రెండో స్థానాన్ని దక్కించుకుంది. దీంతో ఆమె రజత పతకాన్ని సొంతం చేసుకుంది.

వివరాలు

అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకం..

ఈ విభాగంలో నైజీరియాకు చెందిన ఒనోమే ఒమోలోలా అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.

ఆమె స్నాచ్‌లో 93 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 113 కిలోలు ఎత్తి మొత్తం 206 కిలోల బరువును లిఫ్ట్ చేసి కామన్వెల్త్ గేమ్స్ కొత్త రికార్డును నెలకొల్పింది.

మరోవైపు కెనడాకు చెందిన రెబెకా గ్రౌల్క్స్ మొత్తం 178 కిలోల బరువును ఎత్తి కాంస్య పతకాన్ని అందుకుంది.

జ్ఞానేశ్వరి ప్రదర్శనలో మరో విశేషం ఏమిటంటే.. స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ రెండు విభాగాల్లోనూ ఆమె చేసిన ప్రతి ప్రయత్నం విజయవంతమైంది.

ఒక్క లిఫ్ట్ కూడా విఫలం కాకుండా పోటీని పూర్తి చేయడం ఆమె నైపుణ్యాన్ని చాటిచెప్పింది.

వివరాలు

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఐదు పతకాలు..

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని భోండియా గ్రామానికి చెందిన 23 ఏళ్ల జ్ఞానేశ్వరి యాదవ్ ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ శాఖలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తోంది.

ఆమె తండ్రి ఒకప్పుడు బాడీబిల్డర్‌గా ఎదగాలనే లక్ష్యంతో కృషి చేసినప్పటికీ, ఆర్థిక పరిస్థితుల కారణంగా తన కలలను పక్కన పెట్టాల్సి వచ్చింది.

ప్రస్తుతం ఆయన ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నారు. జ్ఞానేశ్వరి సాధించిన ఈ రజతంతో కామన్వెల్త్ గేమ్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ ఖాతాలో మొత్తం నాలుగు పతకాలు చేరాయి.

అంతకుముందు మహిళల విభాగంలో మీరాబాయి చాను స్వర్ణ పతకం సాధించగా, పురుషుల విభాగంలో రిషికాంత్ సింగ్, ముత్తుపాండి రాజా రజత పతకాలు గెలుచుకున్నారు.

మొత్తంగా ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఇప్పటివరకు ఐదు పతకాలను తన ఖాతాలో వేసుకుంది.

ADVERTISEMENT