
Kraigg Brathwaite: విండీస్ బ్యాట్స్‌మన్ సెన్సేషన్.. విండీస్ ఆటగాడు క్రైగ్ బ్రాత్‌వైట్ క్రేజీ రికార్డు!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ మొత్తం టీ20ల మోజులో మునిగిపోయింది. ప్రతి దేశం ఒక్కో లీగ్‌ను నిర్వహిస్తోంది. ఇలా చూస్తే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 టీ20 లీగ్స్ ఉన్నాయి. అయితే ఈ ట్రెండ్‌లో బహుళమంది క్రికెటర్లు టెస్టులు, వన్డేలు వీడి, టీ20లకు మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఒక ప్లేయర్ మాత్రం అందరికీ భిన్నంగా నిలుస్తున్నాడు. అతడే విండీస్ ప్లేయర్ క్రైగ్ బ్రాత్‌వైట్. ఈయన ఇప్పటివరకు ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు, అదే సమయంలో వన్డేల్లోనూ కేవలం 10 మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. వన్డేలు కూడా 8 ఏళ్ల క్రితమే ఆఖరిసారిగా ఆడాడు. కానీ టెస్టు క్రికెట్‌లో మాత్రం 100 మ్యాచ్‌లు పూర్తి చేసి అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.
Details
రెండో టెస్టులో వందో మ్యాచ్
2011లో పాకిస్థాన్‌పై తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడిన బ్రాత్‌వైట్, ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో 100వ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ14 ఏళ్ల ప్రయాణంలో అతడు వన్డే, టీ20ల వైపు మొగ్గుచూపకుండానే, టెస్టు క్రికెట్‌కు పూర్తిగా అంకితమయ్యాడు. ఇది విండీస్ క్రికెట్ చరిత్రలో ఓ విశేషమే. క్రైగ్ బ్రాత్‌వైట్ టెస్ట్ కెరీర్‌లో ఇప్పటి వరకు 5943 పరుగులు చేశారు. ఇందులో 12 సెంచరీలున్నాయి. సాధారణంగా కరేబియన్ ఆటగాళ్లంటే పవర్ హిట్టింగ్, టీ20లే గుర్తొస్తాయి. టీ20ల ప్రభావం ఉన్న ఈ కాలంలోనూ, ఒక క్రికెటర్ ఇలా టెస్టులకు మాత్రమే పరిమితమై 100 టెస్ట్‌లు ఆడడం అనే విషయం నిజంగా అరుదైన ఘనతగా చెప్పుకోవాలి.