Vinesh Phogat: వినేశ్ ఫొగాట్‌పై డబ్ల్యుఎఫ్ఐ అనర్హత వేటు
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రముఖ మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్ కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలింది. క్రమశిక్షణా ఉల్లంఘనలు, డోపింగ్ నిరోధక నియమావళిని పాటించకపోవడం వంటి ఆరోపణల నేపథ్యంలో ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అదనంగా, ఈ ఏడాది జూన్ 26 వరకు దేశీయ స్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు. ఈ నిర్ణయంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని గొండాలో మే 10 నుంచి 12 వరకు నిర్వహించనున్న జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో కూడా ఆమెకు అవకాశం లేకుండా పోయింది.
వివరాలు
నాలుగు ప్రధాన ఆరోపణలు..
డబ్ల్యూఎఫ్‌ఐ వెల్లడించిన వివరాల ప్రకారం, అంతర్జాతీయ నిబంధనల ప్రకారం పదవీ విరమణ అనంతరం మళ్లీ పోటీల్లోకి రావాలంటే తప్పనిసరిగా ఆరు నెలల నోటీస్ వ్యవధిని పూర్తి చేయాలి. అయితే, ఆ నిబంధనను వినేశ్ ఫొగాట్ పాటించలేదని సమాఖ్య పేర్కొంది. ఆమె ప్రవర్తన భారత రెజ్లింగ్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని, దేశ గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించారని ఆరోపించింది. జాతీయ, అంతర్జాతీయ రెజ్లింగ్ నిబంధనలను ఉల్లంఘించారనే అభియోగాలను కూడా ప్రస్తావించింది. అలాగే, పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హతకు గురైన అంశంతో పాటు నాలుగు ప్రధాన ఆరోపణలపై వినేశ్ నుంచి వివరణ కోరింది.
వివరాలు
బ్రిజ్ భూషణ్‌పై వేధింపుల ఆరోపణలు..
ఇదిలా ఉండగా, డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్వగ్రామ ప్రాంతంలో ఈ పోటీలు నిర్వహించడం తనకు మానసిక ఒత్తిడిని కలిగిస్తోందని వినేశ్ ఇటీవల వ్యాఖ్యానించారు. బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఆరుగురు మహిళా రెజ్లర్లలో తాను కూడా ఒకరిగా ఉన్నానని ఆమె గుర్తుచేశారు. పోటీల సమయంలో తనకు లేదా తన బృంద సభ్యులకు ఏదైనా అపరిస్థితి ఎదురైతే దానికి భారత ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ పరిస్థితుల మధ్య, టోర్నీ ప్రారంభానికి కేవలం ఒక రోజు ముందు డబ్ల్యూఎఫ్‌ఐ ఈ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.