IND Vs NZ: టీమిండియాకు షాక్ ఇచ్చిన.. కివీస్ 23 ఏళ్ళ యువ ఫాస్ట్ బౌలర్.. ఇతను ఎవరంటే?
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో, న్యూజిలాండ్ యువ ఫాస్ట్ బౌలర్ విలియం ఒరోర్కే తన అద్భుతమైన పేస్‌తో భారత జట్టును బెంబేలెత్తించాడు. 23 ఏళ్ల ఈ యువ సంచలనం, భారత బ్యాటింగ్ లైనప్‌ను చీల్చి, టీమిండియాను కేవలం 46 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఒరోర్కే తన ప్రదర్శనతో ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. ఊహించని విధంగా, ఒరోర్కే నాలుగు కీలక వికెట్లు తీసి,భారత జట్టు బ్యాటర్లను సవాల్ చేశాడు. భారత గడ్డపై మొదటిసారి ఆడుతున్నప్పటికీ,అతను అతని బౌలింగ్‌తో విరుచుకుపడాడు. మొదటి వికెట్‌గా విరాట్ కోహ్లీని డకౌట్ చేసి శభాష్ అనిపించుకున్న అతను, తరువాత జైశ్వాల్, రాహుల్, బుమ్రా వికెట్లను కూడా తీసుకున్నాడు.
ఆడిన 5 టెస్టుల్లో, రెండు సార్లు 5 వికెట్లు తీసిన ఘనత
మరో ఎండ్‌లో సీనియర్ పేసర్ మాట్ హెన్రీ 5వికెట్లు తీయడంతో భారత్ జట్టు పూర్తిగా తేలిపోయింది. సీనియర్ బౌలర్లు హెన్రీ, సౌథీ వికెట్లు తీసుకోవడం సాధారణమే. కానీ, ఒరోర్కే లాంటి యువ బౌలర్ తన తొలి టెస్టులోనే భారత గడ్డపై నాలుగు వికెట్లు తీయడం విశేషం. శ్రీలంక సిరీస్‌లో అతని మెరుగైన ప్రదర్శనను దృష్టిలో ఉంచుకొని, ఈ సిరీస్‌కి అతడిని ఎంపిక చేయడమే కాకుండా, తుది జట్టులో అవకాశం ఇవ్వడం సమర్థించుకుంది. ఈ అవకాశం అతను బాగా సద్వినియోగం చేసుకొని,భారత బ్యాటర్లకు పెద్ద సవాల్‌గా మారాడు. ఇప్పటి వరకు ఆడిన 5 టెస్టుల్లో, రెండు సార్లు 5 వికెట్లు తీసిన ఘనత సాధించిన ఒరోర్కే, న్యూజిలాండ్ క్రికెట్‌లో కొత్త సంచలనం అని చెప్పవచ్చు.