LOADING...
IPL 2026 Qualifier 1: ధర్మశాలలో ఆర్సీబీతో తలపడేది ఎవరు..? గుజరాత్, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య హోరాహోరీ!
ధర్మశాలలో ఆర్సీబీతో తలపడేది ఎవరు..? గుజరాత్, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య హోరాహోరీ!

IPL 2026 Qualifier 1: ధర్మశాలలో ఆర్సీబీతో తలపడేది ఎవరు..? గుజరాత్, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య హోరాహోరీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 19, 2026
02:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ చూడని అరుదైన ఘట్టానికి ఈసారి అభిమానులు సాక్ష్యమివ్వబోతున్నారు. తొలిసారిగా లీగ్ చరిత్రలో ఒక కీలక నాకౌట్ మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన ధర్మశాల స్టేడియంలో నిర్వహించనున్నారు. సముద్ర మట్టానికి సుమారు 1,457 మీటర్ల ఎత్తులో, మంచుతో మెరిసే దౌలాధర్ పర్వత శ్రేణుల నడుమ జరగనున్న ఈ మ్యాచ్‌పై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. మే 26 రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ క్వాలిఫైయర్-1 పోరు, ప్రకృతి సోయగాలు మరియు ఉత్కంఠభరితమైన క్రికెట్ కలయికగా నిలవనుంది. లీగ్ దశ ముగిసే సరికి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఈ క్వాలిఫైయర్-1లో తలపడనున్నాయి.

వివరాలు

అగ్రస్థానంలో ఆర్సీబీ

ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అగ్రస్థానాన్ని దాదాపు ఖరారు చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇక రెండో స్థానం కోసం గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే గుజరాత్ టైటాన్స్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మిగిలిన లీగ్ మ్యాచ్‌ల ఫలితాలు మారితే హైదరాబాద్ కూడా ఆ రేసులోకి బలంగా దూసుకురావచ్చు.

వివరాలు

టికెట్ల కోసం ఎదురుచూపులు

ఈ క్వాలిఫైయర్-1 మ్యాచ్ విజేత నేరుగా మే 31న అహ్మదాబాద్‌లో జరగనున్న గ్రాండ్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిపోయిన జట్టుకూ మరో అవకాశం ఉంటుంది. ఆ జట్టు మే 29న చండీగఢ్‌లో జరిగే క్వాలిఫైయర్-2లో ఎలిమినేటర్ విజేతతో తలపడాల్సి ఉంటుంది. దీంతో ఈ పోరు రెండు జట్లకూ అత్యంత కీలకంగా మారింది. వరుసగా రెండో ఏడాది కూడా ట్రోఫీని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఉన్న ఆర్సీబీకి ఇది మరింత ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌గా మారింది. విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం బెంగళూరు జట్టుకు పెద్ద బలంగా మారింది. ఇక ఈ హై వోల్టేజ్ మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు ఇప్పటికే ఎదురుచూపులు ప్రారంభించారు.

Advertisement

వివరాలు

మే 20 నుంచి విక్రయం

ధర్మశాల వంటి అద్భుతమైన వేదికపై జరిగే ఈ పోరుకు సంబంధించిన టికెట్ల విక్రయాలు మే 20 నుంచి ప్రారంభం కానున్నాయి. అధికారిక భాగస్వామి ద్వారా ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. తొలి రోజు రూపే క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ప్రత్యేక ముందస్తు అవకాశం ఇవ్వగా, మే 21నుంచి సాధారణ ప్రేక్షకులందరికీ టికెట్లు విక్రయించనున్నారు. ఆర్సీబీ మ్యాచ్ కావడంతో టికెట్లు కొన్ని నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ అయ్యే అవకాశముందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. హిమగిరుల మధ్యనున్న ధర్మశాల వేదికపై ఆర్సీబీ తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంటుందా? లేక ప్రత్యర్థి జట్టు సంచలనం సృష్టిస్తుందా?అన్న ఉత్కంఠకు మే 26న తెరపడనుంది.

Advertisement