LOADING...
SRH : క్వాలిఫయర్-1 ప్రత్యేకత ఇదే.. ఓడినా ఫైనల్ ఆశలు సజీవం
క్వాలిఫయర్-1 ప్రత్యేకత ఇదే.. ఓడినా ఫైనల్ ఆశలు సజీవం

SRH : క్వాలిఫయర్-1 ప్రత్యేకత ఇదే.. ఓడినా ఫైనల్ ఆశలు సజీవం

వ్రాసిన వారు Moogati Shabari
May 23, 2026
02:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సన్‌ రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ సన్‌రైజర్స్‌కు లీగ్ దశలో చివరిదిగా నిలిచింది. ఈ విజయంతో ఆ జట్టు మొత్తం తొమ్మిది విజయాలు నమోదు చేసి 18 పాయింట్లతో తమ లీగ్ ప్రయాణాన్ని ముగించింది. ఇక మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు కూడా తమ 14 లీగ్ మ్యాచ్‌లను పూర్తి చేశాయి. ఈ రెండు జట్లు కూడా తొమ్మిది మ్యాచ్‌ల్లో గెలిచి 18 పాయింట్లు సంపాదించాయి.

వివరాలు

రన్ రేటే కాపాడిందిలా..

అయితే మూడు జట్లకు సమాన పాయింట్లు ఉన్నప్పటికీ పాయింట్ల పట్టికలో ఆర్‌సీబీ మొదటి స్థానంలో, గుజరాత్ రెండో స్థానంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచాయి. దీనికి ప్రధాన కారణం నెట్ రన్‌రేట్. ఆర్‌సీబీ నెట్ రన్‌రేట్ +0.783గా ఉండగా, గుజరాత్ టైటాన్స్ +0.695 నెట్ రన్‌రేట్‌తో కొనసాగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం +0.524 నెట్ రన్‌రేట్‌తో వెనుకబడింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆర్‌సీబీని 166 పరుగుల లోపే ఆలౌట్ చేసి ఉండి ఉంటే, వారి నెట్ రన్‌రేట్ మెరుగై గుజరాత్‌ను దాటి రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉండేది. కానీ అది సాధ్యపడలేదు.

వివరాలు

ఆదివారం రసవత్తర పోరు..

మే 26న జరిగే క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టుకు మాత్రం మరో అవకాశం ఉంటుంది. క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు మే 27న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో క్వాలిఫయర్-2లో పోటీ పడుతుంది. ఆ తర్వాత మే 29న క్వాలిఫయర్-2 మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. అంటే క్వాలిఫయర్-1కు చేరుకున్న ఆర్‌సీబీ, గుజరాత్ జట్లకు ఫైనల్‌లో అడుగుపెట్టేందుకు రెండు అవకాశాలు లభిస్తాయి. ఇదే క్వాలిఫయర్-1 ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఆదివారం జరిగే మ్యాచ్‌ల అనంతరం దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశముంది.

Advertisement