LOADING...
Afghanistan series: అఫ్గాన్ సిరీస్‌లో రోహిత్ ఉంటాడా..? సెలక్షన్ ముందు ఉత్కంఠ!
అఫ్గాన్ సిరీస్‌లో రోహిత్ ఉంటాడా..? సెలక్షన్ ముందు ఉత్కంఠ!

Afghanistan series: అఫ్గాన్ సిరీస్‌లో రోహిత్ ఉంటాడా..? సెలక్షన్ ముందు ఉత్కంఠ!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 19, 2026
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొన్ని నెలల విరామం తర్వాత భారత క్రికెట్ అభిమానులకు మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌ల సందడి మొదలుకానుంది. వచ్చే నెలలో భారత జాతీయ క్రికెట్ జట్టు అఫ్గానిస్థాన్‌తో కీలక సిరీస్‌లు ఆడనుండగా, ఇందుకు సంబంధించన జట్ల ఎంపికపై ఆసక్తి నెలకొంది. జూన్ 6 నుంచి ప్రారంభమయ్యే ఏకైక టెస్టుతో పాటు, జూన్ 14, 17, 20 తేదీల్లో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్ల ఎంపికకు రంగం సిద్ధమైంది. మంగళవారం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ సమావేశమై జట్లను ఖరారు చేయనుంది. అయితే ఈ ఎంపికలో ప్రధాన చర్చ అంతా స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా చుట్టూనే తిరుగుతోంది.

వివరాలు

వన్డే సిరీస్ కు దూరంగా ఉండే అవకాశాలు

గత కొన్ని నెలలుగా వరుసగా క్రికెట్ ఆడుతూ వస్తున్న బుమ్రాపై పని ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో అతడిని జాగ్రత్తగా వినియోగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుమ్రా టెస్టు మ్యాచ్ ఆడితే వన్డే సిరీస్‌కు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ టెస్టుకు విశ్రాంతి ఇస్తే మాత్రం వన్డేల్లో ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్ కూడా ఇప్పుడు సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఐపీఎల్ సందర్భంగా గాయపడిన రోహిత్ పూర్తిగా కోలుకున్నాడా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇటీవల కొన్ని మ్యాచ్‌లకు దూరమైన హిట్‌మ్యాన్ ప్రస్తుతం కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే బరిలోకి దిగుతున్నాడు.

వివరాలు

ఫిట్‌నెస్‌పై మరిన్ని అనుమానాలు

ముఖ్యంగా ఫీల్డింగ్ చేయకపోవడం ఆయన ఫిట్‌నెస్‌పై మరిన్ని అనుమానాలు పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో అఫ్గానిస్థాన్‌తో జరిగే వన్డే సిరీస్‌కు రోహిత్‌ను ఎంపిక చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. వైద్య బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా ఆయన ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న యువ బ్యాటర్లు సాయి సుదర్శన్, ఫడిక్కల్ టెస్టు, వన్డే జట్లలో చోటు కోసం బలమైన పోటీలో ఉన్నారు. అలాగే యువ పేసర్లు ప్రిన్స్ యాదవ్, ఆఖిబ్ నబీ కూడా తమ ప్రదర్శనలతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇక సీనియర్ పేసర్లు షమీ, భువనేశ్వర్ కుమార్ పునరాగమనం విషయమై సెలక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Advertisement