Page Loader
Wimbledon 2023: జకోవిచ్, స్వియాటెక్‌ శుభారంభం.. విలియమ్స్ ఔట్!
శుభారంభాన్ని అందించిన స్వియాటెక్‌, జకోవిచ్

Wimbledon 2023: జకోవిచ్, స్వియాటెక్‌ శుభారంభం.. విలియమ్స్ ఔట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 04, 2023
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతిష్ఘాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో టాప్ సీడ్ ప్లేయర్లు శుభారంభం అందించారు. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ నోవక్ జకోవిచ్, మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ స్వియాటెక్ తొలి అడ్డంకిని అలవోకగా అధిగమించారు. ఇక వెటరన్ స్టార్ వీనస్ విలియమ్స్ అనుహ్యంగా ఆరంభ రౌండ్‌లోనే ఇంటిబాట పట్టింది. పురుషుల్లో నాలుగో సీడ్ కాస్పర్ రూడ్, ఏడో సీడ్ రుబ్లేవ్, 14వ సీడ్ ముసేటి, 17వ సీడ్ హుర్కాజ్, మహిళల్లో నాలుగో సీడ్ పెగులా, ఐదో సీడ్ గార్సియా బోణీ కొట్టారు. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌తో పాటు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ ఖాతాలో వేసుకొని ఫుల్ జోష్‌లో ఉన్న జొకోవిచ్ తొలి రౌండ్‌లో 6-3, 6-3, 7-6 (7/4)తో కచిన్‌పై విజయం సాధించాడు

Details

చార్డీతో తలపడనున్న కార్లోస్ అల్కరాజ్

ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ విజేత స్వియాటెక్ వింబుల్డన్‌లో బోణీ కొట్టింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో స్వియాటెక్ 6-1, 6-3తో లీ జూపై గెలుపొందింది. నాలుగో సీడ్ పెగులా 6-2, 6-7 (6/8), 6-3తో డావిస్‌ను చిత్తు చేసింది. ఐదో సీడ్ గార్సియా 6-1, 6-3తో మెక్‌నల్లీపై నెగ్గింది. 43 ఏళ్ల వయసులో వింబుల్డన్‌ బరిలో దిగిన మాజీ ఛాంపియన్‌ వీనస్‌ విలియమ్స్‌ తొలి రౌండ్లో 4-6, 3-6తో స్వితోలినా చేతిలో ఓటమిని చవిచూసింది. పురుషుల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌ కార్లోస్‌ అల్కరాజ్‌ మంగళవారం జరుగనున్న తొలి రౌండ్‌లో చార్డీతో తలపడనున్నాడు.