Daniel Vettori: డిసిప్లిన్ జీరో.. లెంగ్త్ లేదు.. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లపై వెట్టోరి ఘాటు విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓటమి పాలైంది. ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుత ప్రదర్శనతో విజయం సాధించింది. ఎస్‌ఆర్‌హెచ్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించి చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ ఓటమిపై ఎస్‌ఆర్‌హెచ్ హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరి నిర్మొహమాటంగా స్పందించారు. జట్టు బౌలింగ్ పూర్తిగా పేలవంగా ఉందని, క్రమశిక్షణ లేకపోవడంతో పాటు సరైన లెంగ్త్‌లో బంతులు వేయలేకపోయామని పేర్కొన్నారు. "మా బౌలింగ్‌లో డిసిప్లిన్ లేదు.
వివరాలు
ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది
అందుకే మ్యాచ్ కోల్పోయాం. ఫిల్ సాల్ట్ వికెట్‌ను త్వరగా తీసుకున్నప్పటికీ, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్లకు సులభంగా పరుగులు చేసే అవకాశం ఇచ్చామని చెప్పారు. చిన్నస్వామి వంటి ఫ్లాట్ పిచ్‌పై 201 పరుగులు సరిపోవని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. "ఒకప్పుడు 200 స్కోరు సేఫ్ అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ఐపీఎల్‌లో పరిస్థితులు మారిపోయాయి. ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. అలాంటి జట్టును ఆపడం కష్టం అని ముందే ఊహించాను" అని వెల్లడించారు. ఇంకా, జట్టులో ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ త్వరగా అవుట్ కావడం ఒత్తిడిని పెంచిందన్నారు.
వివరాలు
బౌలింగ్ విభాగంపై వెట్టోరి తీవ్ర అసంతృప్తి
అయితే ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్తో పాటు చివర్లో అనికేత్ వర్మ అద్భుతంగా ఆడడంతో జట్టు కనీసం ఈ స్కోరుకు చేరుకుందని తెలిపారు. ప్రతి మ్యాచ్‌లో ఓపెనర్లే రాణిస్తారని అనుకోవడం కుదరదని, తమ బ్యాటింగ్ లైనప్‌పై పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. బౌలింగ్ విభాగంపై వెట్టోరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్‌సీబీ బౌలర్ జాకబ్ డఫ్ఫీ ఏ విధంగా సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేసి వికెట్లు తీశాడో చూసి తమ బౌలర్లు నేర్చుకోవాలని సూచించారు. మ్యాచ్ చివర్లో వికెట్లు పడగొట్టినప్పటికీ అప్పటికే నష్టం జరిగిపోయిందని చెప్పారు. అయితే యువ బౌలర్లు డేవిడ్ పేన్, హర్ష్ దూబే రాబోయే మ్యాచ్‌ల్లో మెరుగ్గా రాణిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.