Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ చెలరేగిన అల్లర్లు: ఢాకాలో పేలుడు.. ఒకరు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
క్రిస్మస్ పండుగ సందర్భంగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మరోసారి హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం నగరంలోని మొఘ్‌బజార్ ఇంటర్‌సెక్షన్ వద్ద,బంగ్లాదేశ్ ముక్తిజోద్ధా సంగ్‌సాద్ సెంట్రల్ కమాండ్ కార్యాలయం సమీపంలో శక్తివంతమైన క్రూడ్ బాంబు పేలింది. ఈ పేలుడులో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఢాకా పోలీసుల వివరాల ప్రకారం.. సాయంత్రం 7.10 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు మొఘ్‌బజార్ ఫ్లైఓవర్ పై నుంచి బాంబును విసిరారు. పేలుడు ధాటికి అక్కడ ఉన్న ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు, ఇతర భద్రతా బలగాలను భారీగా మోహరించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
వివరాలు
BNP నేత తారిక్ రెహమాన్ రాక
ఇదిలా ఉండగా.. కొంతకాలంగా ప్రవాసంలో ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) కీలక నేత తారిక్ రెహమాన్ త్వరలోనే ఢాకా రానున్నారని సమాచారం. ఆయన రాక నేపథ్యంలో శాంతిభద్రతలకు ముప్పు పొంచి ఉందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకు ముందే బాంబు పేలుడు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇటీవల వరుస హింసాత్మక ఘటనలు రాజకీయ వాతావరణాన్ని కలవరపెడుతున్నాయి.
వివరాలు
యువ రాజకీయ నేతపై కాల్పులు
డిసెంబర్ 12న షరీఫ్ ఉస్మాన్ హాది అనే రాడికల్ నేతను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఆ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు, హింసాకాండలు పెరిగాయి. మయమన్‌సింగ్ జిల్లాలో దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడు మతవిద్వేష వ్యాఖ్యల ఆరోపణలతో మూకదాడికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై మైనారిటీ సంఘాలు తీవ్రంగా స్పందించడంతో పాటు, భారత్‌తో యూనస్ ప్రభుత్వానికి ఉన్న సంబంధాలపై కూడా ప్రతికూల ప్రభావం పడింది. ఇదే సమయంలో డిసెంబర్ 22న మొతలేబ్ షిక్దర్ అనే మరో యువ రాజకీయ నేతపై కాల్పులు జరగడం కలకలం రేపింది. తాజా ఢాకా బాంబు పేలుడు నేపథ్యంలో దేశంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.