Canada: కెనడాలోని టంబ్లెర్ రిడ్జ్‌లో కాల్పులు: 10 మంది మృతి.. 25 మందికిపైగా గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో ఒక పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటనలో కాల్పులు జరిపిన వ్యక్తితో పాటు మొత్తం 10మంది మృతి చెందగా, 25 మందికిపైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగుడు కూడా తనను తాను గాయపర్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. పాఠశాలలో ఏడుగురు మృతిచెందగా,ఆసుపత్రికి తరలించే మార్గంలో ఒకరు మరణించారని, సమీప నివాస ప్రాంతంలో ఇద్దరు మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. ఘటన తర్వాత టంబ్లర్ రిడ్జ్ పట్టణ ప్రజలు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేయగా,రెండో అనుమానితుడు ఉన్నాడా లేదా,బాధితుల సంఖ్య ఎంతన్నది ఇంకా నిర్ధారిస్తున్నామని చెప్పారు.
వివరాలు
ఎలిమెంటరీ స్కూల్‌లో లాక్‌డౌన్
సుమారు 2,400 జనాభా ఉన్న ఈ పట్టణానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అదనపు పోలీసు బలగాలు, అంబులెన్స్ సేవలు తరలించామని అధికారులు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్‌తో పాటు ఎలిమెంటరీ స్కూల్‌లో కూడా లాక్‌డౌన్ విధించినట్టు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని, భద్రతా కారణాల దృష్ట్యా మరిన్ని వివరాలు వెల్లడించలేమని స్థానిక ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.