రష్యా: విమాన ప్రమాదంలో వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మృతి.. ఆశ్చర్యపోలేదని బైడన్ ప్రకటన
రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నెర్ మెర్సెనరీ గ్రూప్ చీఫ్ అధిపతి యెవ్జెనీ ప్రిగోజిన్ బుధవారం రాత్రి విమాన ప్రమాదంలో మరణించారు. జూన్ నెలలో రష్యా సైనిక నాయకత్వాన్ని కూల్చివేసేందుకు ఆయన ప్రత్నించిన విషయం తెలిసిందే. యెవ్జెనీ ప్రిగోజిన్ మరణాన్ని రష్యా అధికారులు కూడా ధ్రువీకరించారు. రష్యాలో పుతిన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన రెండు నెలల తర్వాత ప్రిగోజిన్ చనిపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి గురైన విమానం రష్యాకు చెందిన ఏవియేషన్ ఏజెన్సీది కావడంతో అనుమానాలకు మరింత బలం చేకూరింది. మాస్కోకు ఉత్తరాన బుధవారం సాయంత్రం కుప్పకూలిన విమానంలో ప్రిగోజిన్ మరణించినట్లు రష్యా అధికారులు తెలిపారు. ప్రిగోజిన్‌తో పాటు విమానంలో ఉన్న మిగతా 10మంది కూడా మరణించినట్లు వెల్లడించారు.
ప్రిగోజిన్ మరణంపై స్పందించిన పుతిన్
ఎంఎన్‌టీ-ఎరోకి చెందిన విమానం కూలిపోయినట్లు రష్యా వైమానిక సంస్థ రోసావియాట్సియా తెలిపింది. క్రాష్‌పై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు రోసావియాట్సియా వెల్లడించింది. తీవ్రమైన నేరాలను విచారించే రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ, క్రాష్‌పై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఇప్పటివరకు ఎనిమిది మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా మృతదేహాలకోసం గాలిస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో రష్యా విజయం నేపథ్యంలో నిర్వహించిన 80వ వార్షికోత్సవం నిర్వహించారు. అందులో పుతిన్ ప్రసంగించారు. అయితే అందులో ప్రిగోజిన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోడం గమనార్హం.
ప్రిగోజిన్ మృతిపై స్పందించిన బైడెన్
వాగ్నెర్ మెర్సెనరీ గ్రూప్ చీఫ్ అధిపతి యెవ్జెనీ ప్రిగోజిన్ మృతిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందించారు. ఏమి జరిగిందో తనకు కచ్చితంగా తెలియదని, రష్యాలో జరిగిన విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ చనిపోయారనే వార్తలపై తాను ఆశ్చర్యపోలేదన్నారు. ఇది తాను ముందే ఊహించినట్లు చెప్పుకొచ్చారు. రష్యా సైనికులపై ప్రిగోజిన్ తిరుగుబాటు చేసి విఫలమైన తర్వాత బైడెన్ అతన్ని హెచ్చరించారు. ఇక నుంచి ప్రిగోజిన్ ప్రతి అడుగును ఆచితూచి వేయాలని జులై నెలలో సూచించారు. బైడెన్ అనుకున్నట్లుగా ప్రిగోజిన్ అనుమానాస్పదంగా చనిపోవడం గమనార్హం.