H-1B visa Fee: H-1Bపై లక్ష డాలర్ల ఫీజు.. మరో ఏడాది కొనసాగించిన ట్రంప్!
ఈ వార్తాకథనం ఏంటి
హెచ్-1బీ (H-1B) వీసా దరఖాస్తులపై విధించిన లక్ష డాలర్ల ఫీజు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన వైఖరి కొనసాగిస్తున్నారు. ఈ వీసాల ద్వారా విదేశీ ఉద్యోగులను నియమించుకునే సంస్థల నుంచి మరో ఏడాదిపాటు ఈ ఫీజును వసూలు చేసేలా ఆయన ఆదేశాలు జారీ చేశారు. తాజాగా దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు. ఈ నిబంధన 2027 సెప్టెంబర్ 21 వరకు కొనసాగనుంది. సాధారణంగా హెచ్-1బీ వీసా దరఖాస్తుకు అయ్యే ఖర్చును కంపెనీలే భరిస్తాయి. గతంలో ఇందుకోసం 2 వేల నుంచి 5 వేల డాలర్ల వరకు ఖర్చయ్యేది. అయితే గతేడాది సెప్టెంబరులో ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచింది.
వివరాలు
ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం
ఆ నిబంధన అమల్లోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సమయంలో.. ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో 12 నెలల పాటు ఈ పెంపును పొడిగించింది.
2025లో తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఐటీ సేవలను అవుట్‌సోర్సింగ్ ఇచ్చే కంపెనీల హెచ్-1బీ రిజిస్ట్రేషన్లలో 92 శాతం తగ్గుదల నమోదైందని అమెరికా ప్రభుత్వం పేర్కొంది.
దీని వల్ల అమెరికన్ కార్మికులు, గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపింది.
అత్యంత నైపుణ్యం కలిగిన వారిని మాత్రమే కంపెనీలు నియమించుకునేలా చూడటమే తమ ప్రధాన ఉద్దేశమని ట్రంప్ ప్రభుత్వం చెబుతూ వస్తోంది.
అమెరికా హెచ్-1బీ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్న విదేశీయుల్లో భారతీయులు ముందువరుసలో ఉన్నారు.
వివరాలు
అందరికీ వర్తించదు
అయితే ఈ లక్ష డాలర్ల ఫీజు అందరికీ వర్తించదు. అమెరికాలో విద్యార్థి వీసాపై ఉండి హెచ్-1బీ వీసాకు దరఖాస్తు చేసుకునే వారికి ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
అలాగే అమెరికా విడిచి వెళ్లకుండా.. ఇప్పటికే ఉన్న వీసా స్టేటస్‌ను మార్చుకునేందుకు చేసుకునే దరఖాస్తులకు కూడా ఈ ఫీజు వర్తించదు.
అయితే ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే దరఖాస్తుదారులు మాత్రం ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
తాజా ప్రకటనలో అమెరికా వెలుపల ఉన్న హెచ్-1బీ ఉద్యోగులపై ఈ చెల్లింపు నిబంధనను ప్రత్యేకంగా పేర్కొన్నారు.
వివరాలు
తాజాగా ఉత్తర్వులు జారీ
మరోవైపు, ఈ లక్ష డాలర్ల రుసుమును అమెరికాలోని 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ బోస్టన్ కోర్టులో సవాలు చేశారు.
ఈ ఫీజును చట్టవిరుద్ధమని పేర్కొంటూ మసాచుసెట్స్‌లోని ఫెడరల్ జిల్లా కోర్టు 2026 జూన్‌లో తీర్పు ఇచ్చింది.
అయితే ఈ వ్యవహారంపై ప్రభుత్వం అప్పీల్ చేయడంతో న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోంది.
జూలైలో ఫస్ట్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఈ కేసులో దిగువ కోర్టు తీర్పును నిలిపివేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది.
దీంతో ఫీజుపై న్యాయపరమైన వివాదం ఇంకా కొనసాగుతోంది. ఇలాంటి న్యాయపరమైన చిక్కులు కొనసాగుతున్నప్పటికీ.. లక్ష డాలర్ల ఫీజును మరో ఏడాది పాటు పొడిగిస్తూ ట్రంప్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.