Nepal: వరదల మధ్య సాహసోపేత రెస్క్యూ.. సొరంగం నుంచి 350 మందిని కాపాడిన సైన్యం.. అందులో 63 మంది భారతీయులు
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్‌లో వరదల కారణంగా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో త్రిశూలి 3ఏ హైడ్రోపవర్ ప్రాజెక్టు వద్ద సొరంగంలో చిక్కుకుపోయిన 350 మందిని నేపాల్ సైన్యం సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. రక్షించిన వారిలో 63 మంది భారతీయులు ఉన్నట్లు నేపాల్ ప్రభుత్వం వెల్లడించింది. ప్రతికూల వాతావరణం, ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు రెస్క్యూ సిబ్బందికి సవాళ్లు విసురుతున్నప్పటికీ.. సహాయక చర్యలను మాత్రం ఆపడం లేదని నేపాల్ ప్రభుత్వం తెలిపింది. సొరంగంలో ఇంకా చిక్కుకుపోయిన సుమారు 100 మందిని బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు పేర్కొంది.
వివరాలు
మృతదేహాల వెలికితీతలోనూ ముమ్మర చర్యలు
వరదల్లో గల్లంతైన వారి ఆచూకీ కోసం చేపడుతున్న గాలింపు, మృతదేహాల వెలికితీతలో జాప్యం జరుగుతోందంటూ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో నేపాల్ సైన్యం తన రెస్క్యూ ఆపరేషన్‌ను మరింత వేగవంతం చేసింది.
అదనపు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి మృతదేహాలను వీలైనంత త్వరగా వెలికితీసేందుకు చర్యలు చేపడుతోంది.
రసువా నుంచి చిత్వాన్ వరకు నదీ మార్గంలో 1200 మంది సైనికులను మోహరించినట్లు నేపాల్ సైన్యం వెల్లడించింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, గాలింపు, రెస్క్యూ కార్యకలాపాల కోసం మొత్తంగా 2800 మంది సైనికులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్లు తెలిపింది.