Page Loader
Georgia: జార్జియాలో తీవ్ర విషాదం.. 11 మంది భారతీయులు మృతి
జార్జియాలో తీవ్ర విషాదం.. 11 మంది భారతీయులు మృతి

Georgia: జార్జియాలో తీవ్ర విషాదం.. 11 మంది భారతీయులు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 17, 2024
08:07 am

ఈ వార్తాకథనం ఏంటి

జార్జియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రసిద్ధ స్కై రిసార్ట్ గూడౌరిలోని ఒక రెస్టారెంట్‌లో 12 మంది అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు,వీరిలో 11 మంది భారతీయులు ఉన్నారని భారత అధికారులు ధృవీకరించారు. హవేలీ అనే భారతీయ రెస్టారెంట్‌లో వీరంతా సిబ్బందిగా పనిచేస్తున్నారు. ప్రాథమిక విచారణలో కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్లే ఈ మరణాలు సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై అక్కడి భారత రాయబార కార్యాలయం స్పందిస్తూ 11 మంది భారతీయుల మృతి తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఇది దురదృష్టకర ఘటనగా పేర్కొంటూ మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసింది. మృతదేహాలను వారి స్వదేశానికి తరలించేందుకు స్థానిక అధికారులతో చర్చలు జరుపుతున్నామని, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.

వివరాలు 

ఫోరెన్సిక్ బృందం ఏర్పాటు

ఈ ఘటన డిసెంబర్ 14న చోటు చేసుకున్నట్లు సమాచారం. విచారణలో బాధితులపై ఎలాంటి దాడులు జరిగినట్లు ఆధారాలు లభించలేదని, వారి శరీర భాగాల్లో గాయాలూ కనిపించలేదని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్లే వారు మరణించారని పోలీసుల సమాచారం మేరకు అక్కడి మీడియా పేర్కొంది. రెస్టారెంట్ రెండో ఫ్లోర్‌లో మృతదేహాలు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా, బాధితుల పడక గదులకు సమీపంలో ఒక పవర్ జనరేటర్ ఉన్నట్లు గుర్తించబడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో జనరేటర్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. అయితే 12 మంది మృతికి ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి ఫోరెన్సిక్ బృందం ఏర్పాటు చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.