Rafah: రఫాలో నిరాశ్రయులపై ఇజ్రాయెల్ దాడులు.. 11 మంది మృతి
గాజా దక్షిణాన ఉన్న పశ్చిమ రఫాలో నిరాశ్రయులైన వ్యక్తుల నివాసాల గుడారాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కనీసం 11 మంది మరణించారని పాలస్తీనా భద్రత వైద్య వర్గాలు తెలిపాయి. అల్-మవాసి ప్రాంతంలోని గుడారాలపై ఇజ్రాయెల్ సైన్యం భీకరంగా ఫిరంగి గుండ్లు , బుల్లెట్లను ప్రయోగించిందని జిన్హువా వార్తా సంస్థ శుక్రవారం తెలిపింది.
ఇజ్రాయెల్ ట్యాంకుల రాకతో నిరాశ్రయులు పరార్
అల్-మవాసి ప్రాంతానికి సమీపంలో ఇజ్రాయెల్ ట్యాంకులు ముందుకు రావడంతో గురువారం రాత్రిపూట బాంబు దాడులు మొదలయ్యాయని భద్రతా వర్గాలు జిన్హువాకు తెలిపాయి. బాంబు దాడులతో కకావికలం చెందిన ప్రజలలో భయాందోళనలకు దారితీసింది. వారు తమ గుడారాలను విడిచిపెట్టి, ఖాన్ యూనిస్‌కు నైరుతి దిశలో ఉన్న ప్రాంతాల వైపు పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాంబు దాడి కారణంగా 11 మంది పాలస్తీనియన్లు మరణించారు. మరో 40 మందికి పైగా వివిధ రకాల గాయాలకు గురయ్యారు. వారందరినీ ఆసుపత్రికి తరలించారని వైద్య వర్గాలు జిన్హువాకు తెలిపాయి.
అల్-మవాసి అనేది సముద్రతీరం
అల్-మవాసి అనేది సముద్రతీరంలోని ఒక బహిరంగ ఇసుక ప్రాంతం. ఇది గాజా స్ట్రిప్ మధ్యలో డెయిర్ అల్-బలాహ్ నగరానికి నైరుతి నుండి పశ్చిమ ఖాన్ యూనిస్ ద్వారా రఫాకు పశ్చిమాన విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, మురుగునీటి నెట్‌వర్క్‌లు, విద్యుత్ లైన్లు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు , ఇంటర్నెట్ లేకపోవడం వల్ల అక్కడ నివసించే వారికి దుర్భర పరిస్ధితులు ఏర్పడుతున్నాయి.