USA: అమెరికాలో యూజీ చదువులకు భారత విద్యార్థుల విముఖత.. దరఖాస్తుల్లో 15% తగ్గుదల
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వలస విధానాలను మరింత కఠినతరం చేస్తున్నారు. అక్రమ వలసదారులపై అరెస్టులు, దేశ బహిష్కరణలు, పలు ఆంక్షలు విధిస్తుండటంతో.. అమెరికాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. 'కామన్ యాప్' నివేదికల ప్రకారం.. 2024-25 విద్యా సంవత్సరంలో అమెరికాలోని వివిధ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో 3.63 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు ప్రవేశాలు పొందారు. అయితే 2025-26 విద్యా సంవత్సరంలో అమెరికా కళాశాలల్లో కోర్సులకు దరఖాస్తు చేసుకునే భారత విద్యార్థుల సంఖ్య 15 శాతం మేర తగ్గింది.
వివరాలు
అంతర్జాతీయ విద్యార్థుల నమోదులోనూ తగ్గుదల
అమెరికా కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అంతర్జాతీయ విద్యార్థుల నమోదుపైనా ఈ ప్రభావం కనిపిస్తోంది.
2026 సెమిస్టర్‌లో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య సుమారు 1.1 లక్షల మేర తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
2025-26లో అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 11.69 లక్షలుగా అంచనా వేయగా.. ఈ ఏడాది అది 10.57 లక్షలకు పడిపోయింది.
కఠినమైన వీసా నిబంధనలు, చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో ఉపాధి అవకాశాలపై నెలకొన్న అనిశ్చితి, సోషల్ మీడియా ఖాతాల పరిశీలన వంటి అంశాలు విద్యార్థుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా అమెరికా వెళ్లిన తర్వాత చదువు పూర్తిచేసుకుని ఉద్యోగం పొందే అవకాశాలపై స్పష్టత లేకపోవడం కూడా విద్యార్థులు ప్రత్యామ్నాయ దేశాల వైపు చూడటానికి కారణమవుతోంది.
వివరాలు
అమెరికన్లకు ఉద్యోగాలిచ్చి.. శిక్షణ ఇవ్వండి
మరోవైపు హెచ్-1బీ వీసాలపై ట్రంప్ ప్రభుత్వం విధించిన కొత్త రుసుమును అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సమర్థించారు.
విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి బదులుగా అమెరికన్ పౌరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కంపెనీలకు సూచించారు.
అమెరికన్లను నియమించుకుని, వారికి అవసరమైన నైపుణ్యాల్లో మెరుగైన శిక్షణ అందించాలని ఆయన పేర్కొన్నారు.