Nepal Floods: సొరంగంలో చిక్కుకున్న కార్మికులు.. గొంతులు వినిపించడంతో వేగంగా సహాయక చర్యలు
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్‌ను కుదిపేసిన భారీ ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. రసువా జిల్లాలోని త్రిశూలి-3ఏ జలవిద్యుత్ కేంద్రం టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల కోసం కొనసాగుతున్న సహాయక చర్యల్లో తాజాగా ఆశాజనక పరిణామం చోటుచేసుకుంది. వరదలు సంభవించి కొన్ని రోజులు గడిచినప్పటికీ.. సొరంగం లోపలి నుంచి కొందరి గొంతులు వినిపించినట్లు రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. దీంతో టన్నెల్‌లో చిక్కుకున్నవారిని సురక్షితంగా బయటకు తీసుకురావచ్చన్న ఆశలు బలపడ్డాయి.
వివరాలు
త్రిశూలి-3ఏ ప్రాజెక్టులో పనిచేస్తున్న 40 మంది కార్మికుల ఆచూకీ గల్లంతు
ఆగస్టు 26న సంభవించిన ఈ భారీ విపత్తు కారణంగా త్రిశూలి-3ఏ ప్రాజెక్టులో పనిచేస్తున్న 40 మంది కార్మికుల ఆచూకీ గల్లంతైంది.
దేశవ్యాప్తంగా ఆరు జలవిద్యుత్ కేంద్రాల్లో పనిచేస్తున్న 900 మందికి పైగా కార్మికులు కూడా వరదల తర్వాత కనిపించకుండా పోయారు.
ఈ నేపథ్యంలో మొదటి నుంచీ సహాయక చర్యల్లో పాల్గొంటున్న రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఎంపీ, ఇంజనీర్ శ్రీ రామ్ నియుపేనే సోషల్ మీడియా ద్వారా కీలక విషయాన్ని వెల్లడించారు.
టన్నెల్ లోపల నుంచి మనుషుల మాటలు వినిపించాయని ఆయన తెలిపారు.
రెస్క్యూ బృందం 'భయపడకండి.. మిమ్మల్ని రక్షిస్తాం' అని చెప్పిన వెంటనే లోపలి నుంచి స్పందన వచ్చినట్లు పేర్కొన్నారు.
వివరాలు
భారీ యంత్రాలతో పాటు ప్రత్యేక రెస్క్యూ పరికరాల వినియోగం
ఈ సమాచారం అందడంతో నేపాల్ సైన్యం, సాయుధ పోలీసు బలగాలు (APF) టన్నెల్‌లోకి వెళ్లి సహాయక చర్యలను మరింత వేగవంతం చేశాయి.
ఇప్పటికే మౌలిక వసతులు దెబ్బతినడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, భూగర్భంలోని తెలియని మార్గాలు రెస్క్యూ సిబ్బందికి తీవ్ర సవాళ్లు విసురుతున్నాయి.
అయినప్పటికీ బృందాలు వెనక్కి తగ్గకుండా గాలింపు కొనసాగిస్తున్నాయి.
టన్నెల్‌లో పేరుకుపోయిన బురద, శిథిలాలను తొలగించేందుకు భారీ యంత్రాలతో పాటు ప్రత్యేక రెస్క్యూ పరికరాలను కూడా వినియోగిస్తున్నారు.
వివరాలు
1,259కి చేరిన మృతుల సంఖ్య
ఇదిలా ఉండగా.. రసువా జిల్లాలోని లాంగ్టాంగ్ ఖోలా జలవిద్యుత్ ప్రాజెక్టులో విషాదకర ఘటన వెలుగుచూసింది.
అక్కడి టన్నెల్‌లో నేపాల్ ఆర్మీకి చెందిన సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు చేపట్టిన గాలింపు చర్యల్లో ఇద్దరి మృతదేహాలు లభించాయి.
20 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న మరో 41 మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.
దీంతో వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
మరోవైపు నేపాల్‌లో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,259కి చేరింది. మరో 5,053 మంది ఇప్పటికీ గల్లంతైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
దీంతో గల్లంతైన వారి కోసం సహాయక, గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశారు.