Pakistan: పాకిస్థాన్‌పై యుద్ధ నేరాల ఆరోపణలు.. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన నివేదిక
ఈ వార్తాకథనం ఏంటి
ఆఫ్ఘనిస్తాన్'లోని ఓ డ్రగ్ రీహాబిలిటేషన్ అండ్ ట్రీట్‌మెంట్ సెంటర్‌పై ఈ ఏడాది మార్చిలో జరిగిన క్షిపణి దాడిపై పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఘటనపై యుద్ధ నేరాల కోణంలో దర్యాప్తు జరపాలని కోరుతూ బుధవారం విడుదల చేసిన నివేదికలో కీలక అంశాలను వెల్లడించింది. మార్చి 16న పాకిస్థాన్,అఫ్గానిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో ఈ దాడి జరిగిందని పేర్కొంది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం,ఈ దాడిలో 269 మంది ప్రాణాలు కోల్పోగా,వందలాది మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మాదకద్రవ్యాల వ్యసనానికి చికిత్స పొందుతున్న రోగులేనని తెలిపింది.
వివరాలు
ఆరోపణలను ఖండించిన పాకిస్థాన్
అయితే ఈ ఆరోపణలను పాకిస్థాన్ పూర్తిగా ఖండించింది.
తాము రీహాబిలిటేషన్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకోలేదని, క్యాంప్ ఫీనిక్స్‌గా పిలిచే ఉగ్రవాదుల ఆయుధాలు, మందుగుండు సామగ్రి నిల్వ కేంద్రంపైనే దాడి చేశామని పాకిస్థాన్ సమాచార శాఖ స్పష్టం చేసింది.
కానీ తమ విచారణలో ఆ ప్రాంతంలో సైనిక స్థావరం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని అమ్నెస్టీ వెల్లడించింది.
లక్ష్యంగా చేసుకున్న ప్రదేశం నిజంగా సైనిక అవసరాలకు ఉపయోగపడుతోందో లేదో పాకిస్థాన్ నిర్ధారించలేదని ఆరోపించింది.
అంతర్జాతీయ మానవతా చట్టాల ప్రకారం వైద్య సేవలు అందించే కేంద్రాలకు ప్రత్యేక రక్షణ ఉంటుందని, ఆ నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొంది.
వివరాలు
ఒమిద్ రీహాబిలిటేషన్ అండ్ ట్రీట్‌మెంట్ సెంటర్'లో 2,000 పడకల సామర్థ్యం
అమ్నెస్టీ తెలిపిన వివరాల ప్రకారం,ఒమిద్ రీహాబిలిటేషన్ అండ్ ట్రీట్‌మెంట్ సెంటర్ ఇటీవలే ఆధునీకరించిన 2,000 పడకల సామర్థ్యంతో పనిచేస్తోంది.
అఫ్గానిస్తాన్‌లో మాదకద్రవ్యాల వ్యసనాన్ని తగ్గించేందుకు తాలిబాన్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ఇది కీలక కేంద్రంగా ఉంది.
ఈ కేంద్రం పక్కనే గతంలో నాటో బలగాలు ఉపయోగించిన క్యాంప్ ఫీనిక్స్ స్థావరం ఉంది.
ఈ దాడిపై ఉపగ్రహ చిత్రాలు,ఫొటోలు,వీడియోలు,ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించినట్లు అమ్నెస్టీ తెలిపింది.
60కు పైగా ఫొటోలు,వీడియోలను ధృవీకరించడంతో పాటు రీహాబిలిటేషన్ కేంద్రంలోని ప్రస్తుత, మాజీ సిబ్బంది,సమీపంలోని ఇబ్న్-ఎ-సీనా ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడినట్లు వెల్లడించింది.
దాడికి మూడు రోజుల ముందు తీసిన ఉపగ్రహ చిత్రాల్లో రోగులు చికిత్స విభాగం, పరిపాలన భవనాల్లో ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొంది.
వివరాలు
రాత్రి 9 గంటల సమయంలో దాడి
ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంగణం పూర్తిస్థాయిలో వైద్య కేంద్రంగానే పనిచేస్తోందని స్థానికులు కూడా వెల్లడించినట్లు తెలిపింది.
రాత్రి సుమారు 9 గంటల సమయంలో దాడి జరిగినప్పుడు పలువురు రోగులు భోజనశాల, వంటశాల వద్ద ఉండటంతో భారీ ప్రాణనష్టం సంభవించినట్లు నివేదికలో పేర్కొంది.
దెబ్బతిన్న భవనాల్లో ఒకటి ఆయుధాల నిల్వ కేంద్రం కాదని, అక్కడ కట్టెలు, బొగ్గు మాత్రమే నిల్వ చేసేవారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
అక్కడ సైనిక సామగ్రి ఆనవాళ్లు కనిపించలేదని, సాధారణ ప్రజలు ఉపయోగించే దుస్తులు, చెప్పులే కనిపించాయని వారు వెల్లడించారు.
వివరాలు
దాడి జరిగిన సమయంలో వెయ్యికి పైగా రోగులు
రీహాబిలిటేషన్ కేంద్రంపై దాడి జరిగిన సమయంలో వెయ్యికి పైగా రోగులు అక్కడ ఉన్నారని ఓ సిబ్బంది అమ్నెస్టీకి తెలిపారు.
ఘటన అనంతరం సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ ఆరోగ్య కార్యకర్త మాట్లాడుతూ, "సహాయం కోసం వినిపించిన ప్రతి చోటికి పరుగెత్తాను. కొంతసేపటికి ఎక్కడా అరుపులు వినిపించలేదు. అడుగుపెట్టిన ప్రతిచోట మృతదేహాలే కనిపించాయి" అని వేదన వ్యక్తం చేసినట్లు నివేదిక వెల్లడించింది.
రీహాబిలిటేషన్ కేంద్రం అని తెలిపే బోర్డులు ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఏర్పాటు చేసి ఉన్నాయని, అది రక్షిత పౌర వైద్య కేంద్రం అని పాకిస్థాన్‌కు తెలిసి ఉండాల్సిందని అమ్నెస్టీ పేర్కొంది.
వివరాలు
యుద్ధ నేరంగా పరిగణించే అవకాశం
లక్ష్యం నిజంగా సైనిక స్థావరమేనా అనే విషయాన్ని నిర్ధారించడంలో పాకిస్థాన్ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని, ఇది అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘనగా, యుద్ధ నేరంగా పరిగణించే అవకాశం ఉందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ దక్షిణాసియా తాత్కాలిక ప్రాంతీయ డైరెక్టర్ ఇసాబెల్ లస్సీ వ్యాఖ్యానించారు.
ఈ ఘటనపై పారదర్శకంగా, స్వతంత్రంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపి పూర్తి నివేదికను బహిర్గతం చేయాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరింది.