LOADING...
Bangkok: బ్యాంకాక్ పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 27 మంది మృతి, 63 మందికి తీవ్ర గాయాలు
బ్యాంకాక్ పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 27 మంది మృతి, 63 మందికి తీవ్ర గాయాలు

Bangkok: బ్యాంకాక్ పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 27 మంది మృతి, 63 మందికి తీవ్ర గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 13, 2026
07:59 am

ఈ వార్తాకథనం ఏంటి

థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర అగ్నిప్రమాదం భారీ విషాదానికి దారితీసింది. నగరంలోని ప్రముఖ 'నా లాడ్‌ప్రావ్' పబ్‌లో ఆదివారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కనీసం 27 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 63 మంది తీవ్రంగా గాయపడ్డారు. పబ్ ప్రవేశ ద్వారం సమీపంలో ప్రారంభమైన మంటలు క్షణాల్లోనే భవనం అంతటా వ్యాపించాయి. దీంతో లోపల ఉన్నవారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అయితే దట్టమైన పొగ భవనం మొత్తం కమ్మేయడంతో పలువురు బయటకు రాలేక లోపలే చిక్కుకుపోయారు.

వివరాలు 

గాయపడిన వారిలో 22 మంది పరిస్థితి అత్యంత విషమం

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సుమారు అరగంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన బ్యాంకాక్ గవర్నర్ చాడ్‌చార్ట్ సిట్టిపంత్ మాట్లాడుతూ, మంటలు వేగంగా పైకప్పు వరకు వ్యాపించాయని తెలిపారు. దట్టమైన పొగ కారణంగా ఊపిరాడకపోవడమే ఎక్కువ మంది మరణాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోందని వెల్లడించారు. గాయపడిన వారిలో 22 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆయన చెప్పారు. అలాగే పబ్ వెనుక భాగంలోని రెస్ట్‌రూమ్‌లలో అనేక మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు.

వివరాలు 

ఘటనా స్థలాన్ని సందర్శించిన థాయిలాండ్ ప్రధాని

ప్రమాదానికి గల కారణాలపై అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ముఖ్యంగా అత్యవసర నిష్క్రమణ ద్వారం(ఫైర్ ఎగ్జిట్)వద్ద అడ్డంకులు ఉండటంతో లోపల ఉన్నవారు వేగంగా బయటకు రాలేకపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పబ్‌లో భద్రతా నిబంధనలు సక్రమంగా అమలు చేశారా లేదా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. థాయిలాండ్ ప్రధాని అనుతిన్ చార్న్‌విరాకుల్ ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రదర్శన ఇస్తున్న ఓ సంగీత కళాకారుడు కీలక విషయాన్ని వెల్లడించాడు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడానికి కొద్ది క్షణాల ముందు స్టేజ్ పక్కన ఉన్న సర్క్యూట్ బ్రేకర్ నుంచి పొగలు రావడం తాను గమనించానని, అనంతరం భారీ పేలుడు శబ్దం వినిపించిందని తెలిపాడు.

Advertisement

వివరాలు 

దట్టమైన పొగ వల్ల పబ్ లోపలే చిక్కుకుపోయిన బాధితులు

ఈ వివరాల ఆధారంగా కూడా అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంలో తన సంగీత బృందానికి చెందిన ఒక సభ్యుడు ప్రాణాలు కోల్పోగా, మరో సభ్యుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదని స్థానిక గాయని సుకన్య వాంగ్‌వాంగ్వాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంటలు చెలరేగిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పబ్ అంతా చీకటిలో మునిగిపోయిందని, దట్టమైన పొగ కారణంగా ఏమీ కనిపించక చాలామంది లోపలే చిక్కుకుపోయారని బాధితులు తెలిపారు. ఘటన వెనుక భద్రతా నిబంధనల ఉల్లంఘన ఏమైనా జరిగిందా అనే కోణంలో అధికారులు సమగ్ర విచారణ చేపట్టి ప్రమాదానికి అసలు కారణాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement