LOADING...
Bangladesh: బంగ్లాదేశ్'లో ఎన్నికల వేళ హింస.. బీఎన్‌పీ-జమాత్ ఘర్షణల్లో 40 మందికి గాయాలు

Bangladesh: బంగ్లాదేశ్'లో ఎన్నికల వేళ హింస.. బీఎన్‌పీ-జమాత్ ఘర్షణల్లో 40 మందికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 09, 2026
08:15 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో హైటెన్షన్‌తో సాగుతున్న సాధారణ ఎన్నికలకు ఇంకా కేవలం 72 గంటల సమయం మాత్రమే మిగిలి ఉండగా,తాజాగా చోటుచేసుకున్న హింసా ఘటనలు ఎన్నికల వాతావరణం ఎంత అస్థిరంగా ఉందో మరోసారి చూపిస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాల్లోనే అతిపెద్ద రాజకీయ మార్పుల దశలో ఉన్న ఈ దేశంలో, శనివారం అర్ధరాత్రి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) కార్యకర్తలు, జమాత్-ఈ-ఇస్లామీ మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణల్లో మహిళలు సహా 40 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. జమాత్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో డబ్బులు పంచారన్న ఆరోపణలతో బీఎన్‌పీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని నిరసన చేపట్టగా, ఇరు వర్గాలు ఎదురెదురుగా రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి హింసకు దారి తీసింది.

వివరాలు 

ఎన్నికల బరిలో లేని అవామీ లీగ్

ఫిబ్రవరి 12న పోలింగ్ జరగనుండగా, ప్రచారం ముగియడానికి కొన్ని గంటల ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం రాజకీయ వర్గాల్లో ఆందోళనకు దారితీసింది. గత ఆరు వారాలుగా బంగ్లాదేశ్ అంతటా ఎన్నికల హింస కొనసాగుతుండగా, ఇప్పటివరకు జరిగిన ఘటనల్లో ఇదే అత్యంత తీవ్ర ఘర్షణగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫిబ్రవరి 12 ఎన్నికలు బీఎన్‌పీకి, జమాత్ నేతృత్వంలోని కూటమికి మధ్య నేరుగా పోటీగా మారాయని, 12.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని అంచనా. 2024 ఆగస్టులో జరిగిన భారీ ప్రజా ఉద్యమంతో షేక్ హసీనా 15ఏళ్ల పాలనకు ముగింపు పలికిన తర్వాత, అవామీ లీగ్ ఎన్నికల బరిలో లేకపోవడంతో,ఈ ఎన్నికలు దశాబ్ద కాలంలోనే నిజమైన పోటీగా మారాయని ఓటర్లు భావిస్తున్నారు.

వివరాలు 

ఎన్నికల ప్రక్రియపై నమ్మకం దెబ్బతినే ప్రమాదం 

300 పార్లమెంట్ స్థానాల్లో 292 స్థానాల్లో పోటీ చేస్తున్న తమ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేంత బలం వస్తుందని బీఎన్‌పీ అధినేత తారిక్ రహమాన్ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ ఈ ఎన్నికలను 'గ్రాండ్ ఫెస్టివల్'గా అభివర్ణిస్తూ, ఇవి దేశ చరిత్రలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలవుతాయని హామీ ఇచ్చారు. అయితే వరుస హింసా ఘటనలు కొనసాగితే ఎన్నికల ప్రక్రియపై నమ్మకం దెబ్బతినే ప్రమాదముందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితం దేశ ఆర్థిక పునరుద్ధరణతో పాటు, భారత్, చైనా, పాకిస్తాన్ వంటి దేశాలతో బంగ్లాదేశ్ సంబంధాలపై కూడా ప్రభావం చూపనుందని అంచనా.

Advertisement

వివరాలు 

జనరేషన్-జెడ్ ఓటింగ్ కీలకం 

యువ ఓటర్లు, ముఖ్యంగా జనరేషన్-జెడ్ ఓటింగ్ తీరు కీలకమవుతుందని నిపుణులు చెబుతుండగా, వారి నిర్ణయం ప్రభుత్వ ఏర్పాటులో తుది పాత్ర పోషించే అవకాశం ఉందని అంచనా. తమ అభిప్రాయానికి విలువ దక్కుతుందన్న ఆశతో, తొలిసారి ఓటు వేయబోతున్న యువత పోలింగ్‌కు సిద్ధమవుతోంది. తాజా హింస నేపథ్యంలో భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నప్పటికీ, రాబోయే తీర్పు బంగ్లాదేశ్ రాజకీయ, ఆర్థిక భవిష్యత్తును సంవత్సరాల పాటు ప్రభావితం చేయనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement