మంచు తుపాను ఎఫెక్ట్: 34 మందిని మృతి.. అంధకారంలో లక్షల మంది
మంచు తుపానుతో అమెరికా అల్లాడిపోతోంది. మైనస్ 40డిగ్రీల ఉష్టోగ్రతలతో అక్కడి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న మంచు... శీతల గాలుల కారణంగా అగ్రరాజ్యంలో 34మంది మృత్యువాత పడ్డారు. అమెరికాలోని 60శాతం జనాభాపై ఈ తుపాను ప్రభావం పడింది. మంచుతుపాను వల్ల జనజీవనం స్తంభించిపోయింది. ఇళ్ల ముందు కుప్పలు, కుప్పలుగా మంచు పేరుకుపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు. అగ్రమాపక వాహనాలు కూడా మంచులో చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు కూడా కష్టంగానే మారినట్లు అధికారులు చెబుతున్నారు. కెనడా సమీపంలోని గ్రేట్ లేక్స్ నుంచి మెక్సికో సరిహద్దు వెంబడి రియో గ్రాండే వరకు మంచు తుపాను విస్తరించి ఉన్నట్లు అమెరికా వాతావరణ శాఖ చెప్పింది.
విమాన సర్వీసుల రద్దు
మంచు తుపాను కారణంగా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతో వందలాది విమానాలు ఎయిర్ పోర్టులకే పరిమితమయ్యారు. ఆదివారం ఒక్కరోజే.. దాదాపు 1,707 దేశీయ, అంతర్జాతీయ విమానాలు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. బీభత్సంగా కురుస్తున్న మంచు తుపాను... క్రిస్మస్ వేడుకలపై ప్రభావాన్ని చూపింది. గంటకు 40కిలోమీటర్ల వేగంతో వీస్తున్న శీతల గాలులు, విద్యుత్ సంక్షోభం, ఎరతెరపి లేకుండా కుస్తున్న మంచు కారణంగా.. న్యూయార్క్లోని బఫెల్లోతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు క్రిస్మస్‌ను జరుపుకోలేకపోయారు. మంచు తుపాను నేపథ్యంలో మరణాలు కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.