LOADING...
Earthquake: ఫిలిప్పీన్స్‌లో 6.9 తీవ్రతతో భూకంపం.. 31 మంది మృతి
ఫిలిప్పీన్స్‌లో 6.9 తీవ్రతతో భూకంపం.. 31 మంది మృతి

Earthquake: ఫిలిప్పీన్స్‌లో 6.9 తీవ్రతతో భూకంపం.. 31 మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 01, 2025
08:44 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫిలిప్పీన్స్‌లో మంగళవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లోని సెబు ప్రావిన్స్‌లోని బోగో నగరానికి 17 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నగరంలోనే కనీసం 14 మంది మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకంపనల ప్రభావంతో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడగా, కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు.

Details

గాయపడ్డ 147 మంది

గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించగా, ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్‌లు కొనసాగుతున్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం ఇప్పటి వరకు 147 మంది గాయపడ్డారని, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా శాన్ రెమిజియో పట్టణంలో ముగ్గురు కోస్ట్ గార్డ్ అధికారులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు వైస్ మేయర్ ఆల్ఫీ రేనెస్ తెలిపారు. బోగో నగరంలో అనేక ఇళ్లు, రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భూకంపం తాలూకు తీవ్రత దృష్ట్యా అధికారులు తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేశారు. లేటె, సెబు, బిలిరాన్ తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అయితే కొంతసేపటి తర్వాత ఆ సునామీ హెచ్చరికలను అధికారులు ఉపసంహరించుకున్నారు.