Ebola Cases: ఎబోలా కలకలం.. 600 అనుమానిత కేసులు.. వైరస్ వేగంగా వ్యాపించడానికి కారణాలేంటి?
ఈ వార్తాకథనం ఏంటి
ఆఫ్రికా దేశాల్లో మళ్లీ ఎబోలా వైరస్ భయాందోళనలు సృష్టిస్తోంది. కాంగో డెమోక్రాటిక్ రిపబ్లిక్ (DRC), ఉగాండాలో ఇప్పటివరకు 600కు పైగా అనుమానిత కేసులు నమోదు కాగా.. 139 మంది మృతి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా WHO దీనిని "పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్"గా ప్రకటించింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్నది ఎబోలా వైరస్‌లో అరుదైన 'బుండిబుగ్యో' స్ట్రెయిన్‌గా గుర్తించారు. ఈ వైరస్ కారణంగా DRCలోని ఇటూరి, నార్త్ కివు ప్రాంతాల్లో 51 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఉగాండా రాజధాని కంపాలాలో కూడా రెండు కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒకరు మృతి చెందారు. వీరంతా కాంగో నుంచి ప్రయాణించిన వారేనని అధికారులు తెలిపారు.
వివరాలు
వైరస్ బారిన పడిన అమెరికాకు చెందిన మిషనరీ వైద్యుడు
అమెరికాకు చెందిన మిషనరీ వైద్యుడు పీటర్ స్టాఫోర్డ్‌కూ ఎబోలా సోకినట్లు నిర్ధారణ అయింది. కాంగోలో సేవలందిస్తున్న సమయంలో ఆయన వైరస్ బారిన పడినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనను చికిత్స కోసం జర్మనీకి తరలించారు. WHO సమాచారం ప్రకారం.. ఈ వ్యాధి ఏప్రిల్ 20 ప్రాంతంలో ప్రారంభమైనట్లు అనుమానిస్తున్నారు. తొలి మరణం తర్వాత అంత్యక్రియలు లేదా ఆస్పత్రి పరిసరాల్లో "సూపర్ స్ప్రెడర్" ఘటన చోటుచేసుకుని వైరస్ వేగంగా వ్యాపించి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
వివరాలు
ఎబోలా వైరస్ లక్షణాలు
ఎబోలా వైరస్ సోకిన వారికి మొదట జ్వరం, శరీర నొప్పులు, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి ముదిరితే లోపల, బయట రక్తస్రావం కూడా జరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా రోగుల రక్తం, లాలాజలం, శరీర ద్రవాలు తాకడం వల్ల వైరస్ వ్యాపిస్తుంది. రోగులను చూసుకునే కుటుంబ సభ్యులు, వైద్య సిబ్బంది, రక్షణ పరికరాలు లేకుండా సేవలందించే వారు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఆస్పత్రులు, శరణార్థి శిబిరాలు, ఘర్షణ ప్రాంతాలు, గనుల ప్రాంతాల్లో వైరస్ వేగంగా వ్యాపించే అవకాశముందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
ఈ స్ట్రెయిన్‌లో మరణాల శాతం సగటున 40 శాతం
అయితే ప్రస్తుతం ఈ ఎబోలా వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిగా మారే అవకాశం తక్కువేనని WHO స్పష్టం చేసింది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానమ్ గెబ్రియేసస్ మాట్లాడుతూ.. ఇది అంతర్జాతీయ అత్యవసర పరిస్థితి అయినప్పటికీ, గ్లోబల్ పాండమిక్ స్థాయికి చేరలేదన్నారు. అయితే బుండిబుగ్యో స్ట్రెయిన్‌కు ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదా ప్రత్యేక చికిత్స అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ స్ట్రెయిన్‌లో మరణాల శాతం సగటున 40 శాతం వరకు ఉంటుందని WHO తెలిపింది.
వివరాలు
భారత్‌లో నమోదు కానీ ఎబోలా కేసులు
ఇక భారత్‌లో ఇప్పటివరకు ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయినప్పటికీ WHO హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలిలా శ్రీవాస్తవ అధ్యక్షతన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య అధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా పర్యవేక్షణ, పరీక్షలు, ఎయిర్‌పోర్ట్ స్క్రీనింగ్ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
వివరాలు
భారత్‌కు వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక సూచనలు
కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. జ్వరం లేదా ఇతర లక్షణాలు కనిపిస్తే ఇమ్మిగ్రేషన్‌కు వెళ్లే ముందు ఎయిర్‌పోర్ట్ హెల్త్ డెస్క్‌ను సంప్రదించాలని తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ప్రపంచం అంతా అనుసంధానమై ఉన్న ఈ కాలంలో అంటువ్యాధులను స్థానిక సమస్యలుగా చూడలేమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.