Loading...
China Dam Disaster: ఒక్క రాత్రిలో 62 డ్యామ్‌లు కూలి.. 2.3 లక్షల మందిని బలిగొన్న చైనా వరద
ఒక్క రాత్రిలో 62 డ్యామ్‌లు కూలి.. 2.3 లక్షల మందిని బలిగొన్న చైనా వరద

China Dam Disaster: ఒక్క రాత్రిలో 62 డ్యామ్‌లు కూలి.. 2.3 లక్షల మందిని బలిగొన్న చైనా వరద

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2026
01:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒక్క హిమనీనదం విరిగిపడితేనే నేపాల్‌లో ఎంతటి విధ్వంసం చోటుచేసుకుందో ఇప్పుడు చూస్తున్నాం. అదే ఏడాది మొత్తం కురవాల్సిన వర్షం కేవలం మూడు రోజుల్లో కురిస్తే? ఒకే రాత్రిలో 62 ఆనకట్టలు తెగిపోతే? ఆ స్థాయి జలప్రళయం ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. సరిగ్గా 51 ఏళ్ల క్రితం చైనాలో ఇలాంటి భయానక విపత్తే సంభవించింది. తెల్లవారకముందే వేలాది మంది జలసమాధి అయ్యారు. గ్రామాలకు గ్రామాలు వరదలో కొట్టుకుపోయాయి. ఆ విషాదం తాలూకు జ్ఞాపకాలు ఇప్పటికీ చైనీయులను వెంటాడుతూనే ఉన్నాయి.

వివరాలు 

మూడు రోజుల్లో 1605 మి.మీ. వర్షం

1975 జులై చివరి రోజుల్లో ఫిలిప్పీన్స్‌ సముద్రంలో 'నీనా' అనే టైఫూన్‌ ఏర్పడింది. కొద్ది రోజులకే అది మరింత బలపడి తైవాన్‌ మీదుగా చైనావైపు దూసుకొచ్చింది.

అనంతరం ఫుజియాన్‌ ప్రావిన్స్‌లో తీరాన్ని దాటింది. దాని ప్రభావంతో హెనాన్‌ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి.

24 గంటల వ్యవధిలోనే 1000 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.

ఆగస్టు 5 నుంచి 7 వరకు మూడు రోజుల్లో ఏకంగా 1605 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో హెనాన్‌లోని బాంకియావో డ్యామ్‌కు భారీగా వరదనీరు చేరింది.

రిజర్వాయర్‌లోకి ప్రతి సెకనుకు దాదాపు 13 వేల క్యూబిక్‌ మీటర్ల నీరు వచ్చి చేరింది.

వివరాలు 

ఒక్క రాత్రిలో 62 ఆనకట్టలు ధ్వంసం

ఆగస్టు 7 అర్ధరాత్రి దాటిన తర్వాత బాంకియావో డ్యామ్‌ రక్షణ గోడను దాటి నీరు ప్రవహించడం ప్రారంభమైంది.

పరిస్థితి కొన్ని గంటల్లోనే అదుపుతప్పింది.చివరకు రిజర్వాయర్‌ కూలిపోయి భారీ స్థాయిలో నీరు దిగువ ప్రాంతాల వైపు దూసుకెళ్లింది.

ఆరు గంటల్లోనే సుమారు 701మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీరు డ్యామ్‌ నుంచి బయటకు వెళ్లినట్లు తరువాతి అధ్యయనాలు వెల్లడించాయి.

వరద ప్రవాహం గంటకు 30 నుంచి 50కిలోమీటర్ల వేగంతో పల్లపు ప్రాంతాల వైపు సాగింది.

ఇదే సమయంలో బాంకియావోకు 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిమన్‌తాన్‌ డ్యామ్‌ కూడా వరద ఉద్ధృతిని తట్టుకోలేకపోయింది.

అమెరికా సహా పలు అంతర్జాతీయ సంస్థలు నిర్వహించిన అధ్యయనాల ప్రకారం.. ఆ ఒక్క రాత్రిలోనే మొత్తం 62 ఆనకట్టలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

గ్రామాలు, పట్టణాలను ముంచేసిన వరద

ఆనకట్టలు తెగిపోవడంతో భారీ వరద దిగువ ప్రాంతాలను ముంచెత్తింది. గ్రామాలు, పట్టణాలు నీటిలో చిక్కుకున్నాయి.

రైల్వే మార్గాలు, రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. వేల ఎకరాల వ్యవసాయ భూములు నీట మునిగాయి.

2017లో వెలువడిన ఓ అధ్యయనం ప్రకారం.. ఈ వరదల సమయంలోనే సుమారు 26 వేల మంది మరణించారు.

అయితే విపత్తు అనంతరం ఏర్పడిన ఆహార కొరత, క్షామ పరిస్థితులు, అంటువ్యాధులు కూడా భారీ ప్రాణనష్టానికి కారణమయ్యాయి. వాటి ప్రభావంతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు తరువాత వెల్లడైంది.

ADVERTISEMENT

వివరాలు 

విషాదాన్ని 20 ఏళ్లు దాచి..

బాంకియావో డ్యామ్‌ విపత్తు వల్ల జరిగిన నష్టాన్ని చైనా ప్రభుత్వం దాదాపు రెండు దశాబ్దాల పాటు బయటకు రానివ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి.

ఆనకట్టలు కూలిన విషయాన్ని మాత్రమే అప్పట్లో అక్కడి మీడియా ప్రధానంగా ప్రసారం చేసింది.

ఈ విపత్తుకు సంబంధించిన కొన్ని అధికారిక రికార్డులను ఏకంగా 30 ఏళ్ల వరకు రహస్యంగా ఉంచినట్లు కూడా సమాచారం.

బాంకియావో డ్యామ్‌ కూలిపోవడంతో దిగువ ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాది మంది దాదాపు తొమ్మిది రోజుల పాటు నీటిమధ్య చిక్కుకుపోయారు.

తినడానికి ఆహారం అందక కొందరు ఆకులు తిని బతికినట్లు కథనాలు వెలువడ్డాయి.

వివరాలు 

విషాదాన్ని 20 ఏళ్లు దాచి..

మరికొందరు రోజుల తరబడి చెట్లపై ఆశ్రయం పొందాల్సి వచ్చింది. చైనాకు చెందిన కొందరు సీనియర్‌ పరిశోధకులు, మానవహక్కుల సంస్థలు నిర్వహించిన అధ్యయనాల ప్రకారం.. ఈ విపత్తు ప్రత్యక్ష, పరోక్ష కారణాలతో కలిపి సుమారు 2.3 లక్షల మరణాలకు దారితీసింది.

1995లో ఈ వివరాలతో నివేదిక వెలువడిన తర్వాతే 1975 నాటి ఈ భయానక జలప్రళయం గురించి ప్రపంచానికి విస్తృతంగా తెలిసింది.

వివరాలు 

'ఐరన్‌ డ్యామ్‌'గా పేరున్న బాంకియావో

చైనాలో కమ్యూనిస్టు నేత మావో జెడాంగ్‌ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో, 1951-52 మధ్య హెనాన్‌లోని 'రు నది'పై బాంకియావో డ్యామ్‌ను నిర్మించారు.

అయితే నిర్మాణం పూర్తయిన కొన్నేళ్లకే ఆనకట్టలో పగుళ్లు కనిపించాయి. డ్యామ్‌ గేట్లు కూడా దెబ్బతిన్నాయి.

దీంతో సోవియట్‌ ఇంజినీర్ల సూచనల మేరకు 1955-56లో మరమ్మతులు చేపట్టారు. ఆనకట్టను మరింత పటిష్ఠంగా మార్చారు.

అప్పట్లో దాని బలాన్ని ఉద్దేశిస్తూ బాంకియావోను 'ఐరన్‌ డ్యామ్‌'గా పిలిచేవారు.

అయితే 1975లో వచ్చిన అపూర్వమైన వరద ఉద్ధృతిని అది తట్టుకోలేక పూర్తిగా ధ్వంసమైంది. అనంతరం 1986 నుంచి 1993 మధ్య బాంకియావో డ్యామ్‌ను తిరిగి నిర్మించారు.

వివరాలు 

నిర్లక్ష్యమే విపత్తుకు కారణమా?

పలు అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం.. 1975లో చైనాలో సంభవించిన ఈ మహా విపత్తు వెనుక అనేక కారణాలు ఉన్నాయి.

అధికారుల వైఫల్యం, నాణ్యతలో లోపాలున్న ఆనకట్టల నిర్మాణం, భారీ వర్షాలపై ముందస్తు హెచ్చరికలను సీరియస్‌గా తీసుకోకపోవడం వంటి అంశాలు పరిస్థితిని మరింత విషమంగా మార్చాయి.

ప్రకృతి విపత్తుతో పాటు మానవ తప్పిదాలు కూడా తోడవడంతో బాంకియావో డ్యామ్‌ విషాదం చరిత్రలోనే అత్యంత భయానక ఆనకట్ట విపత్తుల్లో ఒకటిగా నిలిచిపోయింది.

ADVERTISEMENT