Page Loader
Thailand-Cambodia clash: 800 సంవత్సరాల శివాలయం కోసం థాయిలాండ్-కంబోడియా మధ్య ఘర్షణ.. సరిహద్దుల్లో ఉద్రిక్తత 
800 సంవత్సరాల శివాలయం కోసం థాయిలాండ్-కంబోడియా మధ్య ఘర్షణ..

Thailand-Cambodia clash: 800 సంవత్సరాల శివాలయం కోసం థాయిలాండ్-కంబోడియా మధ్య ఘర్షణ.. సరిహద్దుల్లో ఉద్రిక్తత 

వ్రాసిన వారు Sirish Praharaju
May 30, 2025
03:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

కంబోడియా-థాయిలాండ్ మధ్య సరిహద్దు వద్ద బుధవారం నాడు వాతావరణం ఉద్రిక్తంగా మారింది. వివాదాస్పద ప్రాంతంలో ఇద్దరు దేశాల సైన్యాల మధ్య కాల్పులు చోటు చేసుకోగా, ఈ ఘటనలో ఒక కంబోడియా సైనికుడు ప్రాణాలు కోల్పోయాడని కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ ఘటన ప్రీఅహ్ విహియర్ ప్రావిన్స్ (కంబోడియా) ఉబోన్ రట్చతాని ప్రావిన్స్ (థాయ్‌లాండ్) మధ్య సరిహద్దులో జరిగింది. ఘటన అనంతరం ఇరు దేశాల సైనికులు వెనక్కి తగ్గగా, పరిష్కారానికి దౌత్య చర్చల ద్వారా ముందుకు సాగుతామని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.

వివరాలు 

2011లో ఇరుదేశాల మధ్య తీవ్రంగా ఘర్షణలు

ప్రీఅహ్ విహియర్ ఆలయంపై కంబోడియా-థాయ్‌లాండ్ మధ్య సుదీర్ఘ కాలంగా సరిహద్దు వివాదం కొనసాగుతూనే ఉంది. 2011లో ఇదే ఆలయం విషయంలో ఇరుదేశాల మధ్య తీవ్రంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తాజాగా జరుగుతున్న పరిణామాలు కూడా అదే ప్రాంతంలో జరుగుతుండటం గమనార్హం. ఈ ఆలయం చుట్టూ ఉన్న భూభాగం ఎంతోకాలంగా వివాదాస్పదంగా మారడమే ఇలాంటి ఘర్షణలకు మూలకారణంగా నిలుస్తోంది. ఈ ఆలయం 9వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం మధ్య ఖ్మేర్ రాజవంశానికి చెందిన చక్రవర్తులు సూర్యవర్మన్ 1,సూర్యవర్మన్ 2లు క్రీ.శ. 9 నుంచి క్రీ.శ 12వ శతాబ్దం మధ్య నిర్మించి శివుడ్ని ప్రతిష్ఠించారు.

వివరాలు 

థాయ్‌లాండ్ సరిహద్దుకు సమీపంగా ఉన్న కొండపై ఆలయ నిర్మాణం 

ఈ ఆలయం ప్రీఅహ్ విహియర్ ప్రావిన్స్‌లో ఉన్నా, థాయ్‌లాండ్ సరిహద్దుకు సమీపంగా ఉన్న కొండపై నిర్మించారు. దక్షిణ భారత శిల్పశైలిలో నిర్మించబడిన ఈ ఆలయం ఖ్మేర్ శిల్పకళకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. శివుని ఆరాధనకు ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా పూర్వం ఖ్మేర్ పాలకులకు ఇది ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. 2008లో యునెస్కో ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడంతో, ఈ ప్రాంతంలో రాజకీయంగా ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఆలయం కంబోడియా భూభాగంలో ఉన్నప్పటికీ, దాని చుట్టుపక్కల ఉన్న భూమిపై తమకూ హక్కు ఉందని థాయ్‌లాండ్ వాదిస్తోంది. ఆలయానికి వెళ్లే ప్రధాన మార్గాలు థాయ్‌లాండ్ ప్రాంతం గుండా వెళ్లడం వల్ల, ఈ వివాదం మరింత ఘర్షణాత్మకంగా మారింది.

వివరాలు 

2011లో భారీ కాల్పులు.. స్వల్పంగా నష్టాన్ని చవిచూసిన ఆలయం 

1962లో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ వివాదంపై తీర్పు వెలువరించినప్పుడు, అది కంబోడియాకు అనుకూలంగా ఉండగా, థాయ్‌లాండ్ మాత్రం సరిహద్దు రేఖలు స్పష్టంగా లేవంటూ మళ్లీ ప్రశ్నలు లేవనెత్తుతోంది. 2008 నుంచి 2011 మధ్య కాలంలో ఆలయం పరిసరాల్లో ఇరుదేశాల సైన్యాల మధ్య పలు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. 2011లో జరిగిన భారీ కాల్పుల్లో ఆలయం స్వల్పంగా నష్టాన్ని చవిచూసింది. తాజా కాల్పుల విషయంలో కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, థాయ్ సైన్యం కంబోడియా సైన్యం స్థావరంగా ఉపయోగిస్తున్న ప్రాంతంపై కాల్పులు ప్రారంభించిందని, ఈ కాల్పుల కారణంగా తమ సైన్యంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.

వివరాలు 

సుమారు 10 నిమిషాలు కాల్పుల మార్పిడి 

ఈ నేపథ్యంలో థాయ్‌లాండ్ స్పందిస్తూ, తమ సైనికులు కేవలం మాటల ద్వారా కంబోడియా సైనికులను వివాదాస్పద ప్రాంతంలోకి ప్రవేశించకుండా ఆపే ప్రయత్నం చేశారని, అయితే వారు ముందుగా కాల్పులకు పాల్పడ్డారని, దాంతో తమ సైన్యం కౌంటర్-ఫైర్‌కు దిగిందని మేజర్ జనరల్ విన్‌థాయ్ సువారీ వెల్లడించారు. థాయ్ సైనికులకు ఈ కాల్పుల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. విన్‌థాయ్ వ్యాఖ్యల ప్రకారం, "కంబోడియా దళాలు పరిస్థితిని సరిగా అర్థం చేసుకోకుండానే ఆయుధాలను ప్రయోగించాయి. అందుకే థాయ్ దళాలు తమదైన రీతిలో స్పందించాయి," అని తెలిపారు. ఈ కాల్పుల మార్పిడి దాదాపు 10 నిమిషాలపాటు కొనసాగినట్లు వెల్లడించారు.

వివరాలు 

ఇరు దేశాల మాజీ ప్రధానుల మధ్య సన్నిహిత సంబంధాలు 

ఇక సుదీర్ఘకాలంగా చారిత్రక విభేదాలు ఉన్నా కూడా, గతంలో థాయ్‌లాండ్‌కు చెందిన మాజీ ప్రధాన మంత్రి థాక్సిన్ షినవత్ర , కంబోడియా నేత హున్ సేన్‌ల మధ్య సన్నిహిత సంబంధాల వల్ల రెండు దేశాల మధ్య ప్రభుత్వస్థాయిలో బంధాలు మిశ్రమంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి, వారి వారసులు తాత్కాలికంగా ప్రధాన మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

థాయిలాండ్-కంబోడియా మధ్య ఘర్షణ