Harry Boxer Detained in US: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు షాక్.. అమెరికాలో హ్యారీ బాక్సర్ అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన కీలక అనుచరుడు హ్యారీ బాక్సర్‌ను అమెరికాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు హత్యలు, బెదిరింపులు, బలవంతపు వసూళ్ల కేసుల్లో భారత పోలీసులకు కావాల్సిన హ్యారీ బాక్సర్ అలియాస్ హరిరామ్‌ను కాలిఫోర్నియాలో అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ అందించిన కీలక సమాచారంతో శుక్రవారం రాత్రి ఈ అరెస్టు చేసినట్లు తెలిపారు. అధికారుల వివరాల ప్రకారం.. హ్యారీ బాక్సర్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. అమెరికాలో ఉంటూ గ్యాంగ్ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా భారత్‌లో పలువురిని లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి.
వివరాలు
బెదిరించినట్లు గుర్తించిన అధికారులు
బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులను సైతం సోషల్ మీడియా పోస్టులు, ఆడియో సందేశాల ద్వారా బెదిరించినట్లు అధికారులు వెల్లడించారు.
దీంతో భారత దర్యాప్తు సంస్థలు అతడి కదలికలపై నిఘా పెట్టాయి. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ముంబైలోని జుహూలో ఉన్న నివాసం వెలుపల ఈ ఏడాది ఫిబ్రవరిలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనకు తానే బాధ్యత వహిస్తున్నట్లు హ్యారీ బాక్సర్ ప్రకటించినట్లు సమాచారం. రోహిత్ శెట్టి ఇంటి బయట ఐదు రౌండ్ల కాల్పులు జరగడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
అయితే అక్కడి సెక్యూరిటీ గార్డు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కూడా కాలేదు.
వివరాు
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. తాజాగా హ్యారీ బాక్సర్ అమెరికాలో పట్టుబడటంతో చర్చనీయాంశంగా మారింది.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన పలువురు సభ్యులు విదేశాల్లో ఉంటూ తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఈ నేపథ్యంలో హ్యారీ బాక్సర్‌ను అమెరికాలో అదుపులోకి తీసుకోవడం దర్యాప్తులో కీలక పరిణామంగా భావిస్తున్నారు.
అతడిని భారత్‌కు తీసుకురావడానికి ఎలాంటి చట్టపరమైన ప్రక్రియలు చేపడతారనే దానిపై అధికారులు ఇంకా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
హ్యారీ బాక్సర్ అరెస్టుతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయా? బాలీవుడ్ ప్రముఖులకు వచ్చిన బెదిరింపుల వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి? అన్నది ఆసక్తికరంగా మారింది.