India Gate chocolate: ఇండియా గేట్ ఆకారంలో చాక్లెట్.. మోదీకి బెల్జియం ప్రధాని స్పెషల్ గిఫ్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రత్యేకంగా 'ఇండియా గేట్' ఆకృతిలో చాక్లెట్‌ను తయారు చేయించారు. అయితే భారత్‌కు తీసుకొస్తున్న సమయంలో అది మార్గమధ్యలోనే కరిగిపోయి పాడైంది. ఈ విషయాన్ని భారత్‌లోని బెల్జియం దౌత్యకార్యాలయం వెల్లడించింది. తాము ప్రత్యేకంగా తయారు చేయించిన 'ఇండియా గేట్ చాక్లెట్' చిత్రాన్ని బెల్జియం దౌత్యకార్యాలయం ఎక్స్ వేదికగా పంచుకుంది. భారత్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీకి ఈ వినూత్న కానుకను అందించాలని బార్ట్ డి వెవర్ భావించారు. అయితే భారత్‌కు తీసుకొస్తుండగా చాక్లెట్ కరిగిపోవడంతో దాన్ని మోదీకి అందించలేకపోయారు.
వివరాలు
ఎలాగైనా మోదీకి అందజేస్తాం
అయితే మరో ప్రతిరూపం బెల్జియంలో సిద్ధంగా ఉందని బార్ట్ డి వెవర్ తెలిపారు. దానిని ఎలాగైనా సురక్షితంగా ప్రధాని మోదీకి అందిస్తానని చెప్పారు.
''ఇండియా గేట్‌ను అత్యుత్తమ బెల్జియం చాక్లెట్లతో రూపొందించి మోదీకి కానుకగా ఇవ్వాలని అనుకున్నా. అసలైన ఇండియా గేట్ చెక్కుచెదరకుండా ఉంది.
కానీ చాక్లెట్‌తో చేసిన ప్రతిరూపం భారత్‌కు చేరుకునేలోపే పాడైంది'' అంటూ వెవర్ సరదాగా వ్యాఖ్యానించారు. తొలి ప్రపంచ యుద్ధ సమయంలో బెల్జియంలో పోరాడిన భారత సైనికుల త్యాగానికి గుర్తుగా ఇండియా గేట్‌ను నిర్మించారు.
ఈ చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెల్జియం ప్రధాని మోదీ కోసం ఇండియా గేట్ ఆకారంలో ఈ ప్రత్యేక చాక్లెట్‌ను తయారు చేయించారు.