Earthquakes: అఫ్గానిస్థాన్‌లో సంభవించిన భూకంపం.. పలు దేశాల్లో ప్రకంపనలు
ఈ వార్తాకథనం ఏంటి
వెనిజులాలో ఇటీవల తీవ్ర నష్టం కలిగించిన భూకంపం అనంతరం, శనివారం ఆఫ్ఘానిస్తాన్‌లో కూడా శక్తివంతమైన భూకంపం సంభవించింది. అయితే, భూకంప కేంద్రం భూమి ఉపరితలం నుంచి సుమారు 215 కిలోమీటర్ల లోతులో ఉండటంతో దాని ప్రభావ తీవ్రత గణనీయంగా తగ్గింది. దీంతో భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించిన వివరాల ప్రకారం, అఫ్గానిస్థాన్‌లోని హిందూ కుష్ పర్వత ప్రాంతంలో జర్మ్ పట్టణానికి దక్షిణ దిశగా సుమారు 43 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైంది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదైంది.
వివరాలు
పాక్ లోని పలు ప్రాంతాల్లో భూకంపాలు..
ఈ భూకంప ప్రభావం అఫ్గానిస్థాన్‌లోని పలు ప్రాంతాలతో పాటు పాకిస్థాన్, భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా కనిపించింది. అయితే, ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఆస్తినష్టానికి సంబంధించిన ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌తో పాటు తూర్పు ప్రాంతాలైన ఖోస్ట్, నాన్‌గర్హర్ ప్రావిన్స్‌లలో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు.
వివరాలు
భయాందోళనలో ప్రజలు..
పాకిస్థాన్‌లో రాజధాని ఇస్లామాబాద్‌తో పాటు స్వాత్, ఉత్తర వజీరిస్థాన్, చిత్రాల్, రావల్పిండి, లాహోర్ నగరాల్లో కూడా ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. భారతదేశంలో దిల్లీ, జమ్మూకశ్మీర్, పంజాబ్, హరియాణా, చండీగఢ్ ప్రాంతాల్లో స్వల్ప స్థాయి ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శనివారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో చండీగఢ్‌లో కొన్ని సెకన్ల పాటు ఇళ్లు కంపించినట్లు ప్రజలు గుర్తించి, అప్రమత్తంగా బయటకు వచ్చారు.