India Day Parade: ఇండియా డే పరేడ్‌లో చారిత్రక ఘట్టం - అయోధ్య రామమందిర నమూనా ప్రదర్శన!
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నిర్వహించే ఇండియా డే పరేడ్‌లో ఈ సారి చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ఆగస్టు 18న జరగనున్న ఇండియా డే పరేడ్‌లో అయోధ్యలోని రామ మందిర నమూనాను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో న్యూయార్క్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వేలాది ప్రవాస భారతీయులు పాల్గొంటారు. అమెరికాలో అయోధ్య రామమందిర రూపాన్ని ప్రదర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ఆలయ ప్రతిరూపం 18 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తుతో ఉండనుంది. ఈ విషయాన్ని విశ్వహిందూ పరిషత్ అమెరికా (VHPA) ప్రధాన కార్యదర్శి అమితాబ్ మిట్టల్ తెలిపారు.
ఇండియా డే పరేడ్ అంటే?
భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని1981 నుంచి ఏటా ఈ ఇండియా డే పరేడ్‌ను భారతీయ అమెరికన్లు నిర్వహిస్తున్నారు. ఆ దేశానికి వెలుపల జరిగే వేడుకల్లో ఇది అతి పెద్ద వేడుక. అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. మిడ్‌టౌన్ న్యూయార్క్‌లోని ఈస్ట్ 38వ వీధి నుంచి ఈస్ట్ 27వ వీధి వరకు ఈ కవాతును నిర్వహిస్తారు. సాధారణంగా ఈ వేడుకలో ప్రతిఏటా 1,50,000లకుపైగా ప్రజలు పాల్గొంటారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (భారత సంఘాల సమాఖ్య) ప్రతి సంవత్సరం ఈ ఇండియా డే పరేడ్ నిర్వహిస్తుంది. ఈ పరేడ్ ఇండియన్ అమెరికన్ వర్గాల సాంస్కృతిక భిన్నత్వాన్ని ప్రతిబింబిస్తుంది.