Page Loader
Fraud: మోడల్ ముసుగులో 700 మంది అమ్మాయిలను మోసం చేసిన టెక్నికల్‌ రిక్రూటర్‌ అరెస్ట్
మోడల్ ముసుగులో 700 మంది అమ్మాయిలను మోసం చేసిన టెక్నికల్‌ రిక్రూటర్‌ అరెస్ట్

Fraud: మోడల్ ముసుగులో 700 మంది అమ్మాయిలను మోసం చేసిన టెక్నికల్‌ రిక్రూటర్‌ అరెస్ట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 04, 2025
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

పగలు బుద్ధిమంతుడిలా ఆఫీస్‌లో పని చేసిన తుషార్ సింగ్ బిష్ట్‌ రాత్రి నేరప్రవృత్తితో భిన్నంగా ప్రవర్తించేవాడు. తన మోడల్‌ ముసుగుతో అమ్మాయిలను బుట్టలో వేసుకుని వారి వ్యక్తిగత వివరాలు సేకరించి బ్లాక్‌మెయిల్ ద్వారా డబ్బులు గుంజేవాడు. ఈ క్రమంలో ఏకంగా 700 మందికి పైగా అమ్మాయిలను మోసం చేసిన తుషార్ చివరికి దిల్లీ పోలీసుల చేతిలో అరెస్టయ్యాడు. 23 ఏళ్ల తుషార్ బీబీఏ పూర్తి చేసి నోయిడాలోని ప్రైవేటు కంపెనీలో టెక్నికల్‌ రిక్రూటర్‌గా పని చేస్తున్నాడు. కానీ డబ్బుపై దురాశతో సైబర్‌ నేరాల బాట పట్టాడు. వర్చువల్‌ ఇంటర్నేషనల్‌ నంబర్‌ ద్వారా బంబుల్‌, స్నాప్‌చాట్‌ వంటి డేటింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో నకిలీ ప్రొఫైల్స్‌ క్రియేట్ చేశాడు.

Details

 బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు

బ్రెజిల్‌కు చెందిన మోడల్‌ ఫొటోలు, కథలతో తన ప్రొఫైల్స్‌ను ఆకర్షణీయంగా మార్చి, అమెరికాలో ఫ్రీలాన్స్‌ మోడల్‌గా పనిచేస్తున్నానని చెబుతూ యువతులతో పరిచయాలు పెంచుకున్నాడు. వారితో స్నేహం చేస్తూ ఫోన్‌ నంబర్లు, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సేకరించి, వారిని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు కాజేశాడు. 2023 డిసెంబర్‌లో దిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని ఒకరు ఫిర్యాదు చేయడంతో అతడి నేరాలు వెలుగులోకొచ్చాయి. దర్యాప్తులో తుషార్‌ 500 మంది బంబుల్‌ వినియోగదారులు, 200 మంది స్నాప్‌చాట్‌ వినియోగదారులతో స్నేహం చేసి డబ్బు గుంజినట్లు వెల్లడైంది. అతడిని అరెస్టు చేసిన పోలీసులు, అతని నుంచి మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 700 మందికి పైగా అమ్మాయిలను వలలో వేసుకున్న ఈ నేరప్రవృత్తి వ్యక్తి చివరకు కటకటాల పాలయ్యాడు.