Saudi Arabia: అక్కరకు రాని పాక్‌తో రక్షణ ఒప్పందం.. సౌదీ చమురు ఎగుమతులకు భారీ ముప్పు!
ఈ వార్తాకథనం ఏంటి
సౌదీ అరేబియా-హూతీ తిరుగుబాటుదారుల (Saudi Arabia-Houthis) మధ్య జరుగుతున్న ఘర్షణలు పాకిస్థాన్‌కు ఇబ్బందికరంగా మారాయి. మక్కా ఒప్పందం కుదిరిన తర్వాత కొనసాగుతున్న ఈ ఘర్షణలు దాయాది దేశాన్ని గట్టిగానే ఇబ్బంది పెడుతున్నాయి. సౌదీతో రక్షణ ఒప్పందం కుదిరినా.. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్ ఆ దేశానికి పూర్తిస్థాయిలో అండగా నిలవడం లేదు. మరోవైపు హూతీల దాడులు తీవ్రం కావడంతో సౌదీ వద్ద ఎగుమతుల కోసం కేటాయించిన చమురు నిల్వలు కొద్ది రోజుల్లోనే ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొందని అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం మరో మలుపు తిరిగింది. హూతీల వరుస దాడులతో సౌదీ అరేబియా ఉక్కిరిబిక్కిరవుతోంది. మక్కా ఒప్పందం నేపథ్యంలో పాకిస్థాన్ ఇటీవల హూతీలను హెచ్చరించింది.
వివరాలు
ఆ విషయంపై ఎలాంటి చర్చ జరగలేదు
దాడులు మరింత విస్తరిస్తే మక్కా ఒప్పందాన్ని యాక్టివేట్ చేస్తామని ప్రకటించింది. అయితే ఆ తర్వాత పాకిస్థాన్ తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గింది.
హూతీలపై సైనిక చర్య అవసరం లేదని, దీనిపై ఎలాంటి చర్చ జరగడం లేదని స్పష్టం చేసింది. పాకిస్థాన్ యూటర్న్ తీసుకున్న తర్వాతే సౌదీ విదేశాంగ మంత్రి భారత్‌కు వచ్చి బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నారంటూ వార్తలొచ్చాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif)సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్(MBS)కు ఫోన్ చేశారు.
హూతీల దాడులు ప్రాంతీయంగా శాంతిభద్రతలకు ముప్పుగా పరిణమించాయని షహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఈ దాడులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ఇంధన సరఫరాలకు అంతరాయంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
వివరాలు
మక్కా ఒప్పందం మాటలకే పరిమితమైనట్లు తెలుస్తోంది
అదే సమయంలో సౌదీ ప్రభుత్వం, ప్రజలకు పాకిస్థాన్ సంఘీభావం ప్రకటించారు.
అయితే తాజా పరిణామాలను పరిశీలిస్తే మక్కా ఒప్పందం ప్రస్తుతం మాటలకే పరిమితమైనట్లు తెలుస్తోంది.
అటు అమెరికా, ఇటు పాకిస్థాన్ పూర్తిస్థాయిలో కలిసి రాకపోవడంతో సౌదీ అరేబియా ఒంటరిగా మిగిలిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.
మరోవైపు హూతీల డ్రోన్ దాడుల కారణంగా ఇంధన సరఫరాలో కీలకమైన ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను సౌదీ అరేబియా మూసివేసింది.
హూతీల దాడుల్లో ఆ పైప్‌లైన్ ఏమైనా దెబ్బతిన్నదా అనే విషయం మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. దానిని ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తామనే విషయాన్ని కూడా సౌదీ ప్రభుత్వం వెల్లడించలేదు.
వివరాలు
చమురులో నాలుగు శాతం వరకు తగ్గుదల
ఎర్రసముద్ర ప్రాంతంలో కీలకమైన ఈ పైప్‌లైన్‌ను సౌదీ అరేబియా తిరిగి ప్రారంభించకపోతే.. ఎగుమతుల కోసం అందుబాటులో ఉన్న చమురు నిల్వలు కొద్దిరోజుల్లోనే ఖాళీ అయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొంది.
ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్న చమురులో నాలుగు శాతం వరకు తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
చమురు సరఫరాలో ఏర్పడే ఈ కొరత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆ కథనం ఆందోళన వ్యక్తం చేసింది.