
Taliban Pressmeet Row: విమర్శల నడుమ మహిళా పాత్రికేయులకు ఆహ్వానం పంపిన అఫ్గాన్ విదేశాంగ మంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
అఫ్గాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ (Amir Khan Muttaqi) ఇటీవల దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశం చుట్టూ మహిళల భాగస్వామ్యంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. మహిళా జర్నలిస్టులను ఉద్దేశపూర్వకంగా పాల్గొననివ్వలేదనే (Male-Only Press Meet) ఆరోపణల నడుమ, ఇప్పుడు ముత్తాఖీ ఆదివారం జరగనున్న మరో మీడియా సమావేశానికి మహిళా పాత్రికేయులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. శుక్రవారం దిల్లీలోని అఫ్గానిస్తాన్ ఎంబసీలో ముత్తాఖీ పాల్గొన్న ప్రెస్ మీట్‌లో ఒక్క మహిళా జర్నలిస్టు కూడా కనిపించలేదు. ఈ సమావేశానికి మహిళలను అనుమతించలేదన్న వార్తలు వెలుగులోకొచ్చాయి.
Details
ఆరోపణలను ఖండించిన తాలిబన్ అధికార ప్రతినిధి
కొందరు మహిళా పాత్రికేయులు సోషల్ మీడియాలో దీనిపై తీవ్రంగా స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. తాజాగా తాలిబన్ అధికార ప్రతినిధి ఈ ఆరోపణలను ఖండించారు. మహిళలపై ఎలాంటి వివక్ష చూపలేదని స్పష్టం చేశారు. పాస్‌ల సంఖ్య పరిమితంగా ఉండటంతో కొందరినే ఆహ్వానించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా ఎవరినీ తప్పించలేదని తెలిపారు. ఇక ఈ వివాదంలో తమ ప్రమేయం లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. మొత్తం వ్యవహారం అఫ్గానిస్తాన్ ఎంబసీ నిర్ణయమేనని అధికార వర్గాలు పేర్కొన్నాయి. విమర్శలు పెరగడంతో, ఇప్పుడు ఆదివారం దిల్లీలో జరుగనున్న తదుపరి విలేకరుల సమావేశానికి మహిళా జర్నలిస్టులను హాజరుకావాలంటూ ఆహ్వానాలు పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది.