Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో ఆకస్మిక వరదలు.. 20 మంది మృతి,100 మందికిపైగా గల్లంతు
ఈ వార్తాకథనం ఏంటి
ఆఫ్ఘనిస్తాన్‌లోని ఈశాన్య నూరిస్థాన్ ప్రావిన్స్‌ను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. భారీ వర్షాలతో సంభవించిన ఈ జలప్రళయంలో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికిపైగా గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. దుర్గమమైన పర్వత ప్రాంతాల్లో సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ, పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గల్లంతైన వారిలో నూరిస్థాన్ ప్రావిన్స్ రాజధాని పరూన్ మేయర్‌తో పాటు ఆయనకు భద్రతగా ఉన్న ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. బాధితుల ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి.
వివరాలు
ఈ విపత్తులో 80 మందికిపైగా తీవ్రంగా గాయాలు
తాలిబన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, వరద ప్రభావం పరూన్ నగరంపై అత్యంత తీవ్రంగా పడింది.
ఉద్ధృతంగా ప్రవహించిన వరద నీరు ఇళ్లు, వ్యాపార సముదాయాలను ముంచెత్తడంతో పాటు నిత్యావసర వస్తువులను కూడా కొట్టుకుపోయింది.
ఈ విపత్తులో 80 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.
అయితే సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. వరదల ధాటికి రహదారులు దెబ్బతినడం, ప్రభావిత ప్రాంతాలు పర్వత ప్రాంతాల్లో ఉండటం వల్ల రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకోవడం కష్టంగా మారింది.
దీంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.