Loading...
Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్టుకు హైకోర్టులో ఎదురుదెబ్బ.. చెట్ల నరికివేతపై వివాదం
చెట్ల నరికివేతపై వివాదం

Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్టుకు హైకోర్టులో ఎదురుదెబ్బ.. చెట్ల నరికివేతపై వివాదం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 19, 2026
09:29 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ డీసీలోని చారిత్రక ఈస్ట్ పొటోమాక్ గోల్ఫ్ లింక్స్‌ను పూర్తిగా ఆధునికీకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ ఖాతాలో కొత్త 18 హోల్స్‌తో కూడిన గోల్ఫ్ మైదానం డిజైన్‌ను ఆయన పంచుకున్నారు. ఈ ప్రాజెక్టు పనులను నవంబర్‌లో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ మైదానం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా యూఎస్ ఓపెన్, పీజీఏ ఛాంపియన్‌షిప్, రైడర్ కప్ వంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నమెంట్లను నిర్వహించగలిగే స్థాయిలో దీనిని అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.

వివరాలు 

న్యాయమూర్తిపై ట్రంప్ బృందం ఆరోపణలు

అయితే, ట్రంప్ ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు ఇప్పటికే న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకుంది.

గోల్ఫ్ మైదానంలో వందలాది చెట్లను ముందస్తు సమాచారం లేకుండానే రాత్రికి రాత్రే తొలగించడంపై ఫెడరల్ జడ్జి అనా రెయెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో అంతర్గత వ్యవహారాల శాఖ అధికారులను విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

ఈ నేపథ్యంలో న్యాయమూర్తి తమ ప్రభుత్వంపై పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ట్రంప్ బృందం ఆరోపించింది.

ఆమె ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని కోరింది. మైదానం ప్రస్తుత పరిస్థితి బాగోలేదని ట్రంప్ సమర్థించుకున్నారు.

అక్కడి చెట్లకు తెగుళ్లు సోకడంతో పాటు తీరప్రాంత రక్షణ గోడలు దెబ్బతిన్నాయని,అందువల్ల పాత నిర్మాణాలను తొలగించి కొత్తగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

వివరాలు 

ప్రజలకు దూరం కానున్న చారిత్రక గోల్ఫ్ మైదానం?

పొటోమాక్ నదిలోని ఓ ద్వీపంలో ఈస్ట్ పొటోమాక్ గోల్ఫ్ మైదానం ఉంది.

ఈ ప్రాంతంలో వాకింగ్ చేసేవారు, సైకిళ్లపై తిరిగేవారు, చేపలు పట్టేవారు,కుటుంబాలతో కలిసి పిక్నిక్‌కు వచ్చే సామాన్య ప్రజల కోసం రహదారులు, నడక మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

అయితే ట్రంప్ విడుదల చేసిన కొత్త డిజైన్‌లో ఈ బహిరంగ ప్రదేశాలు కనిపించకపోవడం ఆందోళనకు కారణమైంది.

పునర్నిర్మాణం పేరుతో ఈ ప్రాంతాన్ని ప్రత్యేక క్రీడా ప్రాంగణంగా మారిస్తే, సాధారణ ప్రజల ప్రవేశంపై పరిమితులు విధించే ప్రమాదం ఉందని పలువురు భావిస్తున్నారు.

చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రజా ఆస్తిని విలాసవంతమైన గోల్ఫ్ వేదికగా మార్చడంపై స్థానికులు, పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

గోల్ఫ్ కోర్స్‌పైనా విచారణ

వాషింగ్టన్ డీసీ రూపురేఖలను మార్చేందుకు ట్రంప్ చేపడుతున్న వివాదాస్పద ప్రాజెక్టుల్లో గోల్ఫ్ కోర్స్ ఆధునికీకరణ కూడా చేరింది.

గతంలో వైట్ హౌస్ ఈస్ట్ వింగ్‌ను కూల్చివేసి కొత్త బాల్‌రూమ్ నిర్మించే ప్రణాళిక,ట్రయంఫల్ ఆర్చ్ నిర్మాణం,కెన్నెడీ సెంటర్‌లో మార్పులు చేపట్టే ప్రయత్నాలు కూడా న్యాయపరమైన వివాదాలను ఎదుర్కొన్నాయి.

ఇదిలా ఉండగా,లింకన్ మెమోరియల్ రిఫ్లెక్టింగ్ పూల్ మరమ్మతుల కోసం 14.7మిలియన్ డాలర్లు ఖర్చు చేసినప్పటికీ,పనుల నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఆల్గే సమస్య కూడా వివాదానికి దారితీసింది.ఈ పరిణామాల నేపథ్యంలో ఈస్ట్ పొటోమాక్ గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్టుపైనా మరింత న్యాయపరమైన పరిశీలన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా చెట్ల తొలగింపు,పర్యావరణ పరిరక్షణ,ప్రజలకు ఉన్న హక్కులు, బహిరంగ ప్రదేశాల వినియోగం వంటి అంశాలు ఈ ప్రాజెక్టులో కీలకంగా మారాయి.

ADVERTISEMENT